ప్రైవేటు విద్యా సంస్థల ఇష్టారాజ్యం…

దిశ దశ, కరీంనగర్:

విద్యాశాఖ నుండి అనుమతి తీసుకుంటే చాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఎలా పీడించినా అడ్డుకునే వారు ఉండరు. ఫీజు నుండి టై, బెల్టు వరకు ప్రతి విషయంలోనూ తమ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవచ్చన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి ప్రైవేటు, కార్పోరేట్ విద్యా సంస్థలు. వీటిపై అజమాయిషీ చేయాల్సిన విద్యాశాఖ పట్టించుకోని వైఖరి అవలంబిస్తుండడంతో సామాన్యుడు నిలువు దోపిడీకి గురవుతున్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగుతున్న ఈ తతంగాన్ని కట్టడి చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది.

ఓన్ సిలబస్…

చాలా వరకు ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల్లో ప్రభుత్వ విద్యను అందించేందుకు ఏ మాత్రం చొరవ చూపడం లేదు. విద్యాశాఖ నుండి రికగ్నైజేషన్ తీసుకుంటున్న ప్రైవేటు విద్యా సంస్థలు తమ సొంత సిలబస్ ను ప్రవేశ పెట్టుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్దంగా సాగుతున్నా వారిని నియంత్రించే వారే లేకుండా పోయారు. తాజాగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నారాయణ కార్పోరేట్ స్కూల్ వద్ద ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు. పాఠశాలలో నారాయణ సంస్థలు తయారు చేసిన సిలబస్ తో పాటు డైరీలు, ఇతరాత్ర మెటిరియల్ ను రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. అడ్మిషన్ సమయంలో ఓ వైపున జాయినింగ్ మరో వైపున విద్యార్థులకు అంటగట్టే మెటిరియల్ వ్యాపారం దర్జాగా సాగుతోంది. తాము నారాయణ కార్పోరేట్ స్కూల్ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరును ప్రత్యక్ష్యంగా చూపించాలని భావించి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే స్పందించలేదని ఏబీవీపీ విద్యార్థులు ఆరోపించారు. నాలుగు గంటల పాటు డీఈఓ, ఏఈఓల కోసం ఎదురు చూసి చివరకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తరువాత చర్యలకు శ్రీకారం చుట్టారని వివరించారు. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి తయారైందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో స్థానిక పోలీసులు కూడా స్కూల్ వద్దకు చేరుకుని పాఠ్యాంశాలు ఉన్న గదిని సీజ్ చేశారు.

యూకేజీకి రూ. 60 వేలు…

కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు వసూలు చేస్తున్న ఫీజుల తీరు అందరినీ షాకుకు గురి చేస్తోంది. ప్రైవేటు విద్యా సంస్థల యజమానుల సంఘం ముఖ్య నేత సమీప బంధువులకు చెందిన పాఠశాలలో యూకేజీకి రూ. 60 వేల ఫీజు వసూలు చేస్తున్నారు. వీరితో పాటు కార్పోరేట్ లుక్కింగ్ ఇస్తున్న చాలా పాఠశాలల్లోనూ అడ్డగోలు ఫీజుల వసూళ్ల దందా కొనసాగుతోంది. ఐదేళ్ల లోపు చిన్నారులకు స్కూళ్లో జాయిన్ చేసుకోరాదని ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు తేల్చి చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న విద్యా విధానంలో అయితే ఆరేళ్ల లోపు చిన్నారులను బడికి తీసుకెళ్లే అవకాశం ఉండదు. కానీ కరీంనగర్ లో మాత్రం దర్జాగా ప్రీ ప్రైమరీ క్లాసుల పేరిట నర్సరీ నుండి యూకేజీ వరకు స్పెషల్ తరగతులు ఏర్పాటు చేసి పేరెంట్స్ ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో కరీంనగర్ లో సాధారణ కుటుంబానికి చెందిన వారు ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను జాయిన్ చేసేందుకు జంకుతున్న పరిస్థితి తయరైంది. ఒక్కో ప్రీ ప్రైమరి స్టూడెంట్ నుండి అడ్మిషన్ ఫీజు, బుక్స్, యూని ఫామ్స్ పేరిటనే దాదాపు 20 వేల వరకూ వసూలు చేస్తుండగా, ట్యూషన్ ఫీజు పేరిట 45 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులను బడిలో చేర్పించుకోకూడదన్న నిభందన ఉన్నప్పటికీ విద్యా సంస్థల నిర్వాహకులు మాత్రం తమ తోచిన విధంగా క్లాసులు స్టార్ట్ చేసి ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యంగ విరుద్దంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల తీరుపై విద్యాశాఖ అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

You cannot copy content of this page