ప్రివిలేజ్ మోషన్ అంశం మళ్లీ తెరపైకి…
దిశ దశ, కరీంనగర్:
ప్రతిపక్ష పార్టీలకు చెందిన చట్ట సభ ప్రతినిధులు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసే అంశం పాశుపతాస్త్రంగా మారినట్టుగా కనిపిస్తోంది. అధికారులపై ఫిర్యాదు చేసేందుకు తమకున్న అవకాశాన్ని చట్ట సభ ప్రతినిధులు అంది పుచ్చుకుంటున్నట్టుగా ఉంది. ఇప్పటి వరకు ప్రివిలేజ్ పిటిషన్ వేయవచ్చు అన్న విషయం మాత్రమే తెలుసు కానీ ఆచరణలో పెట్టేందుకు ప్రజా ప్రతినిధులు అంతగా శ్రద్ద చూపట్టలేదు. కానీ ఇటీవల కాలంలో తమ హక్కులకు భంగం కల్గించారన్న విషయంపై ప్రజా ప్రతినిధులు స్పీకర్ కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇందులో కరీంనగర్ జిల్లాకు చెందిన చట్ట సభ ప్రతినిధులే ఎక్కువగా ప్రివిలేజ్ మోషన్ అంశాన్ని వినియోగించుకుంటున్నట్టుగా స్పస్టం అవుతోంది.
గతంలో బండి సంజయ్…
తమ హక్కులకు భంగం కల్గించారని కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లో్కసభ స్పీకర్ కు రెండు సార్లు ఫిర్యాదు చేశారు. టీచర్ల బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 317 జీఓ విడుదల చేసింది. ఈ జీఓ టీచర్ల బదిలీల విషయంలో అన్యాయం చేసే విధంగా ఉందని ఎంపీ బండి సంజయ్ తన కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయం వద్ద చేపట్టిన ఈ ఆందోళనకు పోలీసులు అనుమతించకపోవడంతో సంజయ్ తన కార్యాలయం లోపల ఆందోళనకు పూనుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆఫీసు గ్రిల్స్ ను కట్టర్ తో కట్ చేసి బండి సంజయ్ ని అరెస్ట్ చేసి మానకొండూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సంజయ్ తన కార్యాలయంలో శాంతియుతంగా నిరసన చెప్తుంటే పోలీసులు అక్రమంగా చొరబడి అరెస్ట్ చేశారని లోకసభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి పోలీసు అధికారులు పలు మార్లు లోకసభ స్పీకర్ కార్యాలయం నుండి సమన్లు అందుకోని వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావల్సి వచ్చింది. గత సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలో మాస్ కాపీయింగ్ అంశంలో ఘాటుగా స్పందించిన బండి సంజయ్ తో పాటు ఓ జర్నలిస్టుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుడు కరీంనగర్ లోని తన ఇంట్లో ఉన్న బండి సంజయ్ ని పోలీసులు అర్థరాత్రి అదుపులోకి తీసుకుని హైదరాబాద్ శివార్లకు తరలించి అక్కడి నుండి వరంగల్ కమిషనరేట్ పరిధికి తీసుకెళ్లి అక్కడి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ విషయంలో కూడా తన హక్కులకు భంగం కల్గించారంటూ బండి సంజయ్ లోకసభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ రెండు అంశాల్లో కూడా బండి సంజయ్ ప్రివిలేజ్ మోషన్ కింద పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. దీంతో పోలీసు అధికారులు సమన్లు అందుకున్న తరువాత ఢిల్లీలోని లోకసభ స్పీకర్ కార్యాలయంలో హాజరు కావల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజాగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి…
హుజురాబాద్ నియోజకవర్గంలో విద్యారంగ సమస్యలపై ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన విద్యాశాఖ అధికారులను ఇంఛార్జి బాద్యతల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ విషయంపై ఆగ్రహించిన కౌశిక్ రెడ్డి డీఈఓపై ప్రివిలేజ్ కు వెల్తానని ప్రకటించారు. అయితే జడ్పీటీసీల పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో చిట్టచివరి జడ్పీ సమావేశం రెండు రోజుల క్రితం కరీంనగర్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత బంధు నిధుల అంశంతో పాటు డీఈఓ తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పతిని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి. జడ్పీ మీటింగ్ లో గందరగోళం నెలకొనడంతో పాటు ప్రజా ప్రతినిధుల మధ్య మాటల యుద్దం నెలకొంది. అయితే అదే రోజు రాత్రి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారుల విధులకు ఆటంకం కల్గించారంటూ జడ్పీ సీఈఓ శ్రీనివాస్ కరీంనగర్ వన్ టౌన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది. దీనిపై స్పందించిన హుజురాబాద్ ఎమ్మెల్యే డీఈఓ, జడ్పీసీఈలపై ప్రివిలేజ్ కు వెల్తానని ప్రకటించారు. దీంతో ఈ ఇద్దరు అధికారులకు రాష్ట్ర శాసనసభ కార్యాలయం నుండి సమన్లు అందే అవకాశాలు ఉంటాయి. కౌశిక్ రెడ్డి ఫిర్యాదు అనంతరం స్పీకర్ కార్యాలయం చట్ట సభకు ఎన్నికైన ప్రతినిధి విషయం జిల్లా అధికారులు తీసుకున్న చర్యలపై నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది.