దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ల అమలు విధానం కొనసాగుతోందని జాతీయ ఎస్పీ పరిరరక్షణ సమితి ఆరోపిస్తోంది. రిజర్వేషన్లను దుర్వినియోగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సమితి జిల్లా అధ్యక్షుడు దావు సంతోష్ కుమార్ నేతృత్వంలో వినతి పత్రం అందజేశారు. యూనివర్శిటీలో అక్రమ నియామకాలు, అక్రమంగా పదోన్నతులు, మత ప్రచారాల జరుగుతున్నాయని ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఈ వినతి పత్రంతో అందించారు. డాక్టర్ అరసాన్ జయంతి నియామకంపై కూడా చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ పరిరక్షణ సమితి కోరింది. కెమిస్ట్రీ, సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న డాక్టర్ అరసాన్ జయంతి తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కాగా కన్వర్టెడ్ అని ఆరోపించారు. రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొంది ఇతర మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారని, వీరికి రిజర్వేషన్ అమలు చేయడం రాజ్యంగ ఉల్లంఘనకు పాల్పడడమేనని, దీనివల్ల తెలంగాణకు చెందిన దళితునికి అన్యాయం చేసినట్టయిందని దావు సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ వీసీ ప్రొఫెసర్ సంకషాల మల్లేష్ యూనివర్శిటీని బ్రస్టు పట్టించి నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారన్నారు. యూజీసీ నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా పదోన్నతులు కల్పించడంతో పాటు నిధుల దుర్వినియోగం చేశారన్నారు. విశ్వవిద్యాలయాల్లో మత ప్రచారాలను కూడా ప్రోత్సహించారని, అన్య మతస్థులకు మద్దతు పలుకుతూ అసలైన ఎస్సీల ఉద్యోగాలను కొల్లగొట్టారన్నారు. ఈ విషయంపై గతంలో పలు మార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని అయినా ఎవరూ పట్టించుకోలేదని దావు సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీలో జరుగుతున్న అక్రమ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించేందుకు చొరవ తీసుకోవాలని ఎస్సీ పరిరక్షణ సమితి కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కోరింది. ఈ కార్యక్రమంలో ఏ రవి, విజయ్ కుమార్, చింరజీవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.