NTPC పైపులైన్ బాధితులుగా అక్బర్ నగర్ కాలనీ వాసులు

పదిహేనుళ్లుగా ఇవే కష్టాలని గగ్గోలు…

దిశ దశ, రామగుండం:

భారీగా వరదలు వచ్చినప్పుడు నది పరివాహ ప్రాంతాల వాసులు ముంపునకు గురవడం సహజం. పరిశ్రమలున్న ప్రాంతాల్లో బాధిత గ్రామాల్లో ఇబ్బందులు ఎదురు కావడమూ సహజమే. కానీ అక్కడ ఓ పైపులైన్ కారణంగా బాధితులుగా మారిపోయారు కాలనీ వాసులు.  దేశానికి వెలుగులు అందిస్తున్న ఆ సంస్థ యంత్రాంగం నిర్లక్ష్యంగా మూలంగా ఓ కాలనీ వాసులపై దశాబ్దంన్నర కాలంగా చీకట్లు కమ్ముకున్నాయి. దీపం కింద చీకటి అన్న నానుడిని మరిపిస్తున్న అధికారులు బాధిత గ్రామాల వారిని పట్టించుకోవడంలో విఫలం అవుతున్నారు.

అక్బర్ నగర్ కాలనీ…

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి సమీపంలోని అక్బర్ నగర్ కాలనీ వాసులు దాదాపు 15 ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కాలనీ మీదుగా వెల్తున్న ఓ పైపులను కారణంగా ఇక్కడ నివసిస్తున్న వారి జీవితాలు బూడిద పాలవుతున్నాయి. తరుచూ ఎదురవుతున్న ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బుధవారం రాత్రి పైప్ లైన్ లీకేజీ కారణంగా కాలనీలోకి బూడిద ప్రవాహం కొనసాగింది. దీంతో కంటిమీద కునుకు లేక, కడుపు నిండ తిండి లేకుండా రాత్రంతా కాలం వెల్లదీశారు కాలనీ వాసులు.

ఎన్టీపీసీ నిర్లక్ష్యం…

రామగుండం జ్యోతి నగర్ లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (NTPC) ఆధ్వర్యంలో విద్యుతు ఉత్పత్తి జరుగుతున్న సంగతి తెలిసిందే. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి నిత్యం బూడిద బయటకు వస్తూ ఉంటుంది. ఈ బూడిదను కుందనపల్లి సమీపంలోని ఓ చెరువుకు తరలించేందుకు ఎన్టీపీసీ అధికారులు ప్రత్యేకంగా పైప్ లైన్ నిర్మించారు. ఈ పైపలు ద్వారా ఎన్టీపీసీలోని బూడిద నేరుగా కుందనపల్లి చెరువుకు వచ్చి చేరుతుంటుంది. అయితే 24 గంటల పాటు నిర్విరామంగా బూడిదను తరలించే ఈ పైపు లైన్లు డ్యామేజీ కావడంతో లీకేజీ మొదలైంది. దీంతో పైపు లైన్ సమీపంలో ఉన్న అక్బర్ కాలనీలోని ఇండ్లలోకి బూడిద వచ్చి చేరుతోంది. ఆహార పదార్థాలు, వంట సామాగ్రితో పాటు ఇళ్లంతా కూడా బూడిదమయం అయిపోతోందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల నిత్యం తాము ఇబ్బందులు పడుతున్నామని, బూడిద వల్ల చిన్నారులు, వృద్దులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వాపోతున్నారు. బూడిద పైప్ లైన్ కారణంగా తాము నిరంతరం ఇబ్బందులు పడుతున్నా ఎన్టీపీసీ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. బాటమ్ యాష్ కారణంగా ఒక్కో ఇంట్లో రెండు నుండి మూడు ఫీట్ల మేర బూడిద పేరుకపోయింది. బుధవారం రాత్రి కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండి తెల్లవార్లూ జాగాహరణ చేసి ఎన్టీపీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. కాలనీ వాసుల సమాచారంతో ఎన్టీపీసీ అధికారులు బూడిద సరఫరాను అప్పటికప్పుడు నిలిపివేశారు. లేనట్టయితే కాలనీలోని ఇండ్లలోకి బాటమ్ యాష్ వచ్చి చేరడంతో అందులోనే స్థానికులు కూరుకపోయి ప్రాణాలు కోల్పోవల్సిన పరిస్థితి దాపురించేంది. బూడిద సరఫరా చేసే పైపులైన్లను పునరుద్దరించాలని, తమను ఆదుకునేందుకు చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు అక్బర్ నగర్ కాలనీ వాసులు. తమ కాలనీలోకి బూడిద చొరబడకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్బర్ నగర్ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్న సమాచారం అందుకున్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ బాదితులకు బాసటగా నిలవాలని, వారికి సహాయక చర్యలు అందించాలని స్థానిక నాయకత్వానికి సూచించారు. దీంతో అంతర్గాంత పాటు సమీప కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్బర్ నగర్ కాలనీకి చేరుకుని బాధితులకు సపరిచర్యలు అందించారు.

సంస్థ విషయంలో…

అయితే NTPC యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై కూడా స్థానికులు విమర్శిస్తున్నారు. చెరువు నిండిపోవడంత భవిష్యత్తులో బూడిదను తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని గమనించారని, దీంతో బూడిదను రోడ్ల నిర్మాణాలకు, ఇటుక తయారీకి తరలించేందుకు అనుమతులు ఇఛ్చారని చెప్తున్నారు. దీంత నిత్యం టన్నుల కొద్ది బూడిద తరలిపోతుండడంతో చెరువు ఖాలీ అవుతుండడంతో ఎన్టీపీసీ ద్వారా విడుదల అవుతున్న బూడిద అదే చెరువుకు తరలించేందుకు అనువుగా మార్చుకుంటున్నారని వివరించారు. తమ సంస్థకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎధురుకాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు పైపు లైన్ లీకేజ్ తో తాము ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులపై ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. సంస్థ విషయంలో అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు సామాన్యుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదంటున్నారు.

You cannot copy content of this page