ప్రమోషన్ వచ్చినా పాత చోటే పనులు

పదోన్నతి ఆర్డర్లు తీసుకున్న 132 మంది…

దిశ దశ, హైదరాబాద్:

రెండున్నర దశాబ్దాల తరువాత ప్రమోషన్ పొందిన పోలీసు అధికారులు మరికొంత కాలం కొత్త పోస్టింగ్ ల్లోకి చేరే అవకాశం కనిపించడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ సంబరం ఎట్టకేలకు అందుకున్న పోలీసు అధికారులు మరో ఆరు నెలల వరకూ వేచి చూడక తప్పేలా లేదు. రాష్ట్రంలోని 1996, 1998 బ్యాచులకు చెందిన 132 మంది సీఐలకు సోమవారం డీజీపీ అంజనీ కుమార్ డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ వ్యక్తిగత ఆర్డర్లు ఇచ్చారు. దీంతో 25 ఏళ్ల తరువాత వారంతా రెండో సారి పదోన్నతి అందుకున్నట్టయింది. అయితే ప్రమోషన్ ఆర్డర్లు తీసుకున్న పోలీసు అధికారులంతా కూడా ఇప్పటి వరకు డ్యూటీ చేస్తున్న చోటే రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనుభంద విభాగాల్లో పని చేస్తున్న వారు తమ స్టేట్ చీఫ్ లను కలిసి రిపోర్టు చేయాల్సి ఉండగా, కమిషనరేట్ ల పరిధిల్లో పనిచేస్తున్న వారు సీపీలు, జిల్లాల్లో పని చేస్తున్న వారు అదే జిల్లా ఎస్పీలకు పదోన్నతి పొందిన ఆర్డర్లు సమర్పించి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. డీజీపీ ఆదేశాలు వచ్చే వరకు కూడా సోమవారం పదోన్నతి పొందిన 132 మంది పోలీసు అధికారులు ఇప్పటి వరకు డ్యూటీలు చేసిన చోటే డీఎస్పీ హోదాలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వీరంతా కూడా అక్కడే ఉండి కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తరువాత పోస్టింగులు అందుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

అన్నా చెల్లెల్లు…

సోమవారం పదోన్నతి ఆర్డర్లు తీసుకున్న వారిలో అన్నాచెల్లెల్లు ఇద్దరూ కూడా ఒకే సారి డీఎస్పీలుగా పదోన్నతి పొందారు. 1996 బ్యాచుకు చెందిన రమణ మూర్తి, ఆయన సోదరి మాధవిలు ఇద్దరు కూడా ఒకే సారి ఎస్సైలుగా పోలీసు విభాగంలో చేరారు. వీరిద్దరు కూడా సోమవారం ఒకేసారి డీఎస్పీలుగా పదోన్నతి పొందడం గమనార్హం.

ఏకైక పోలీసు అధికారిణి…

1996 ప్రాంతంలో పీపుల్స్ వార్, జనశక్తితో పాటు ఇతర నక్సల్స్ కార్యకలాపాలతో అట్టుడుకిపోతున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పోలీసులు విధులు నిర్వర్తించాలంటేనే జంకే పరిస్థితి. ఆ సమయంలో మగవాళ్లు కూడా పోలీసు విభాగంలో విధులు నిర్వర్తించేందుకు సాహసించిన వారు చాలా తక్కువేనని చెప్పాలి. అప్పుడు పోలీసులకు తమ అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేసేందుకు కూడా తల్లిదండ్రులు వెనకంజ వేసిన పరిస్థితి ఉండేది. అలాంటి సమయంలో కూడా ఓ మహిళా ధైర్యంతో పోలీసు విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. వరంగల్ జోన్ లో 1996 బ్యాచ్ లోనే ఏకైక మహిళా అధికారిణిగా వి మాధవి రికార్డులకు ఎక్కారు. తాజాగా డీఎస్పీగా పదోన్నతి పొందిన మాధవి అటు అన్నయ్యతో కలిసి ప్రమోషన్ అందుకోగా, అప్పుడు ఏకైక మహిళా పోలీసు అధికారిణిగా కాఖీ యూనిఫాం వేసుకోవడంతో అరుదైన ఘనత అందుకున్నారు.

You cannot copy content of this page