దండకారణ్యంలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్..? మావోయిస్టు పార్టీలో సరికొత్త పోరు..?

వైరల్ అవుతున్న నక్సల్స్ విబేధాల తీరు

దిశ దశ, దండకారణ్యం:

సమాంతర ప్రభుత్వం నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీలో మరో కొత్త సమస్య తలెత్తిందా..? నిర్భంధానికి తోడు కోవర్టుల సమస్య వెంటాడుతుంటే, తాజాగా మరో అంశంపై కూడా ఆదిపత్య పోరు సాగుతోందన్న ప్రచారం ఊపందుకుంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా చత్తీస్ గడ్ మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో బస్తర్ రేంజ్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. మావోయిస్టు పార్టీలో తెలుగు క్యాడర్ పై వ్యతిరేకత మొదలైందన్న వాదనలు వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ఐజీ సుందర్ రాజ్ పి విడుదల చేసిన ప్రకటనలో బస్తర్ కీకారణ్యంలోని నక్సల్స్ మధ్య జరిగిన కొన్ని సంఘటనలను ఊటంకిస్తూ చేసిన ప్రకటన సరికొత్త చర్చకు దారి తీస్తోంది. మావోయిస్టు పార్టీలో అంతర్గత విబేధాలు ఏర్పడ్డాయని, తెలుగు నాయకత్వానికి వ్యతిరేకంగా బస్తర్ ఆదివాసీ శ్రేణులు వ్యవహరిస్తున్నారని, ఆదివాసీలను తెలుగు నాయకత్వం టార్గెట్ చేస్తోందన్న విషయపై పార్టీలో అభిప్రాయా బేధాలు పొడసూపడంతో ఒకరినొకరు చంపుకునే స్థాయికి చేరుకుందన్న రీతిలో పోలీసుల ప్రకటన సాంరాశం.

పోలీసులు చెప్తున్న అంశాలు…

2024 సెప్టెంబర్ 6న రాజ్‌నంద్‌గావ్-కంకేర్ బోర్డర్ డివిజన్ కమిటీకి చెందిన ACM విజ్జ సౌత్ బస్తర్ నివాసిని తెలుగు క్యాడర్ విజయ్ రెడ్డి అతని సహచరులు చంపారని, సంస్థకు ద్రోహం చేశారన్న కారణంతో ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు వివరించారు. బీజాపూర్ జిల్లా గంగులూరు ఏరియా కమిటీలో అంతర్గత విభేదాలు నెలకొనడంతో 2020 అక్టోబర్ 2న ఆ ఏరియా కమిటీకి చెందిన డీవీసీఎం విజ్జ మొడియం, డివీసీఎం సెక్రటరీ దినేష్ మధ్య ఏర్పడిన గొడవ తారస్థాయికి చేరడంతో దినేష్, అతని సహచరులు విజ్జాను హత్య చేశారని పోలీసులు చెప్తున్నారు. పామేడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు గిరిజనులపై దౌర్జన్యాలు, హత్యలు కొనసాగుతున్నాయన్న ఆందోళన కారణంగానే ఈ వివాదం చోటుచేసుకుందని అంటున్నారు. 2024 ఆగస్ట్ 13న, పామెడ్ ఏరియాలో నక్సల్ కమ్యూనికేషన్ టీమ్‌కు ACMగా పనిచేస్తున్న మనీష్ కుర్సం అలియాస్ రాజును ఇన్‌ఫార్మర్ పేరిట చంపేశారని, సావ్నార్ కు చెందిన మనీష్ కుర్సంను కొత్తగూడెం జిల్లాలో చంపారని పోలీసులు చెప్తున్నారు. 2024 ఆగస్ట్ 21న పార్టీ నాయకత్వం ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో సెక్యూరిటీ టీమ్ కమండర్ గా పనిచేస్తున్న రాధా అలియాస్ నీల్సోను పోలీసు ఇన్‌ఫార్మర్ అన్న కారణంగా చంపేశారని, రాజ్‌నంద్‌గావ్-కంకేర్ బోర్డర్ ఏరియా కమిటీ ఈ ఘటనకు పాల్పడిందని పోలీసులు అంటున్నారు. మరో వైపున దండకారణ్యంలో ఆదివాసీల శ్రేణులకు, తెలుగు నాయకత్వానికి మధ్య కూడా అభిప్రాయ బేధాలు నెలకొన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న షెల్టర్ తీసుకున్న డెన్ పై రాళ్లు విసిరారని, హిడ్మా బెటాలియన్ కు చెందిన నక్సల్స్ ఈ దాడులకు పాల్పడ్డారన్న ప్రచారం కూడా జరుగుతోంది. రాళ్ల దాడి అనంతరం ఇదేంటని ప్రశ్నిస్తే ఈ ప్రాంతంలో ఉండడం సేఫ్ కాదని ఇక్కడి నుండి వెల్లిపోవాలని సూచించినట్టుగా చెప్తున్నారు. ఆదివాసీలపై తెలుగు వారి పెత్తనం ఏంటని, కోవర్టుల పేరిట ఆదివాసీ బిడ్డలను చంపడం సరికాదంటూ బస్తర్ అడవి బిడ్డలు మావోయిస్టు పార్టీ నాయకత్వం తీరును విబేధిస్తున్నారన్న క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. మరో వైపున తెలుగు రాష్ట్రాలలో ఉనికిని కోల్పోయి బస్లర్ అడవుల్లోకి వచ్చి ఆదిపత్యం చెలాయిస్తున్నారన్న భావనను దండకారణ్య మావోయిస్టు పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అంతేకాకుండా తమను నాయకుల రక్షణ వలయంగా వాడుకుంటూ తమనే కోవర్టులు, ఇన్ ఫార్మర్ల పేరిట చంపుతున్నారన్న విషయంపై కూడా ఆదివాసీ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైందన్న వాదనలు కూడా వినిపిస్తున్నారు.

మైండ్ గేమా… నిజమా..?

మావోయిస్టు పార్టీ దండకారణ్య జోన్ లో జరుగుతున్న తీరుపై కోవర్టులకు పాల్పడ్డారని చంపామని, మరికొంతమందిని బహిష్కరించామని పార్టీ నాయకత్వం క్లారిటీగా చెప్పేసింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీలో నెలకొన్న పరిణామాలను అనుకూలంగా మల్చుకుని పోలీసులు చేస్తున్న ప్రచారమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలో ప్రస్తుతం నెలకొన్న కోవర్టుల అనుమానాలను అడ్వంటైజ్ గా చేసుకుని పోలీసులు ఈ రకమైన ప్రచారం చేయడం వల్ల పార్టీ శ్రేణుల్లో అంతర్మథనం మొదలవుతుందని అంచాన వేస్తున్నారన్న భావన కూడా వ్యక్తం అవుతోంది. 1997, 98 ప్రాంతంలో అప్పటి పీపుల్స్ వార్ గ్రూపులో వర్గ విబేధాలు మొదలయ్యాయని కరపత్రాల ద్వారా ప్రచారం జరిగింది. అగ్రనేతలు ముప్పాళ లక్ష్మణ్ రావు, నల్ల ఆదిరెడ్డిల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయిందన్న ప్రచారం కూడా జరిగింది. 1993లో పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని బట్టుపల్లి వద్ద సుమన్ అనే యువకున్ని ఇన్ ఫార్మర్ పేరిట మావోయిస్టులు మొదటి సారి హత్య చేశారు. ఆ తరువాత రాజన్న సిరిసిల్ల కోనరావుపేట అటవీ ప్రాంతంలో కోవర్టులకు పాల్పడ్డారంటూ విచారణ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టిన తరువాత పలువురిని చంపారు. ఆ తరువాత కోవర్టులు, ఇన్ ఫార్మర్ల వ్యవహారం పార్టీని వెంటాడుతూనే ఉండగా కమ్యూనికేషన్స్ విస్తరించడంతో పాటు పార్టీకి కంచుకోటగా ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు పట్టు పెంచుకుని ఉనికి లేకుండా చేయడంలో సఫలం అయ్యారు. తాజాగా బస్తర్ అటవీ ప్రాంతంలో నెలకొన్న పరిణామాలపై పోలీసులు పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. పీపుల్స్ వార్ లో సామాజిక పరమైన వర్గపోరు వెలుగులోకి రాగా తాజాగా దండకారణ్య మావోయిస్టు పార్టీలో లోకల్, నాన్ లోకల్ అన్న వాదాన్ని వినిపిస్తుండడం గమనార్హం. అయితే మావోయిస్టు పార్టీ కోవర్టులను హతం చేస్తుండడం, అనుమానితులను బహిష్కరిస్తుండడం గురించి ఎలా అయితే ప్రకటనలు చేస్తోందో… బస్తర్ అడవుల్లో నెలకొన్న పరిణామాలపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా కాలంగా కూడా తెలంగాణాలో ఉనికిని కోల్పోయిన విషయంలో కేంద్ర కమిటీ స్థాయిలో చర్చ జరిగినట్టుగా ప్రచారంలో ఉంది. ఈ విషయంపై ప్రత్యేకంగా కమిటీలు వేసి పునర్వైభవం కోసం ప్రయత్నాలు చేసినట్టుగా కూడా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో బలహీనమైన క్యాడర్ ఉన్న వారు బలమైన నాయకత్వంగా ఉండడం సరికాదన్న వాదనలు కూడా తెరపైకి వచ్చాయన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ కీకారణ్యాల్లో జరుగుతున్న విషయాలపై ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి మరి.

You cannot copy content of this page