తెరపైకి వచ్చిన ప్రతిపాదనలు…
దిశ దశ, దండకారణ్యం:
తెలంగాణాలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ ట్రిమిజాన్ని అణిచివేసేందుకు మోహరించిన కేంద్ర పారా మిలటరీ బలగాలను వెనక్కి పిలిపించుకోవాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండున్నర, మూడు దశాబ్దాలుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు నక్సల్స్ ఏరివేత కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి. కొంతకాలంగా తెలంగాణలో నక్సల్స్ ఉనికి గణనీయంగా తగ్గిపోవడంతో సరిహద్దు ప్రాంతాలకే ఈ జవాన్ల సేవలు పరిమితం అయ్యాయి. ప్రాణహిత, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో భద్రాత చర్యల్లో కీలక భూమిక పోషిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలను కేంద్ర వెనక్కి పిలిపించుకునే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు సంబంధించిన ఫైళ్లు కూడా సిద్దమవుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాలను ఆనకుని ఉన్న జిల్లాల్లో కేంద్ర రిజర్వూ బలగాలు రక్షణ చర్యల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. స్థానిక సివిల్ పోలీసులు, గ్రే హౌండ్స్ బలగాలు, పోరుగు రాష్ట్రాల్లో భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్న ఆయా విభాగాలతో సమన్వయం అవుతూ మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అయితే సరిహద్దు ప్రాంతాల్లో కూడా మావోయిస్టుల కదలికలు నామమాత్రంగానే ఉండడం, దండకారణ్య అటవీ ప్రాంతం నుండి తెలంగాణాలోకి చొరబడేందుకు అనువైన పరిస్థితులు లేవన్న విషయాన్ని గమనించిన తరువాతే కేంద్ర బలగాలను ఇక్కడి నుండి తరలించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. చత్తీస్ గడ్ లోని పూర్వ బస్తర్ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత చురుగ్గా సాగుతున్న క్రమంలో నక్సల్స్ కార్యకలాపాలను నిలవరించడంలో సఫలం అయ్యామని భావిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇదే సమయంలో నక్సల్స్ కూడా అభూజామడ్ అటవీ ప్రాంతంలో విప్లవ కార్యకలాపాలను స్వేచ్ఛగా నిర్వహించే పరిస్థితులు కూడా లేకుండా పోయాయని కూడా అంచనా వేస్తున్నారు ఉన్నతాధికారులు. ఇందుకు సంబంధించిన నివేదికలు కూడా తెప్పించుకున్న కేంద్ర ప్రభుత్వం పారా మిలటరీ బలగాలను వెనక్కి పిలిపించుకోవడానికే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక గ్రే హౌండ్ర్ చేతిలోనే…
పారా మిలటరీ బలగాలను భారత ప్రభుత్వం వెనక్కి పిలిపించుకుని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ క్యాంపులను ఎత్తివేసిన తరువాత ప్రతికూల పరిస్థితులు రాకుండా ఉండే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చినట్టుగా సమాచారం. నక్సల్స్ ఏరివేతలో క్రియాశీలక పాత్ర పోషించే గ్రే హౌండ్స్ బలగాలను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. వీరిని క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంచినట్టయితే మావోయిస్టుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు నియంత్రించే అవకాశం ఉంటుదని భావిస్తున్నట్టుగా సమాచారం. తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలకు ఒక్క తెలంగాణే కాకుండా, ఏపీ, చత్తీస్ గడ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతంపై పట్టు ఉండడం కూడా లాభిస్తుందన్న చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే సీఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి పంపిచే ప్రక్రియపై స్పష్టమైన ఆదేశాలు రావల్సి ఉంది.