దిశ దశ, మంచిర్యాల:
కష్టాల్లో ఉన్న బాధితులకు షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశం ఇస్తామని ఎర వేసి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. ఆర్థిక అవసరాలు తీర్చడంతో పాటు అవకాశాలు కూడా అందివస్తాయని మాయమాటలు చెప్పి వారిని ముగ్గులోకి దింపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ అక్రమ దందాపై మంచిర్యాల పోలీసులు కొరడా ఝులిపించారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… మంచిర్యాల పట్టణంలోని ఎల్ఐసీ ఆఫీసు ఎదురుగా ఓ ప్రైవేటు గెస్ట్ హౌజ్ కేంద్రంగా వ్యభిచారం సాగుతోందని పోలీసులు సమాచారం అందుకున్నారు. జిల్లాలోని బెల్లంపల్లికి చెందిన సతాని శంకర్ అనే వ్యక్తి వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని గుర్తించిన పోలీసులు ముప్పేట దాడి చేసి విటులను అరెస్ట్ చేశారు. మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టి కాలనీకి చెందిన కరుణాకర్ ఇంటిని అద్దెకు తీసుకుని శంకర్ ను మేనేజర్ గా నియమించి రెండు నెలలుగా వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. గతంలో ఓ లాడ్జిలో పనిచేసిన శంకర్ సోషల్ మీడియాలో అందమైన బాధితుల ఫోటోలను షేర్ చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసుల విచారణలో గుర్తించారు. విటుని వద్ద రూ. 2 వేలు వసూలు చేస్తూ బాధితులకు రూ. 1000 చెల్లిస్తున్నాడన్న సమాచారం అందుకున్నపోలీసు అధికారులు ఈ గెస్ట్ హౌజు గుట్టును రట్టు చేశారు. దాదాపు వారం రోజుల క్రితం కరీంనగర్ కు చెందిన బాధిత మహిళ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన నిర్వాహకుడు అమెను ఈ రొంపిలోకి దింపాడు. ఆమెకు ఫోన్ చేసి మరీ అందంగా ఉన్నవాని, షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశం కల్పిస్తానని, డబ్బులు పెద్ద మొత్తంలో ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. శంకర్ మాటలు నమ్మిన బాధితురాలు మంచిర్యాలలోని ప్రైవేటు గెస్ట్ హౌజ్ కు వచ్చిన తరువాత ఆమె ఫోటోలను మంచిర్యాల, బెల్లంపల్లి, సీసీ నస్పూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లోని విటులకు షేర్ చేశాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆరుగురు విటులు గెస్ట్ హౌజ్ కు చేరుకోగానే వారిని షార్ట్ ఫిలిం మేకర్స్ గా బాధితురాలికి పరిచయం చేశాడు. భర్త లేకపోవడంతో పాటు కష్టాల్లో ఉన్న ఆమె శంకర్ మాటలు నమ్మి ఆయన చెప్పినట్టుగా నడుచుకునేందుకు ఒప్పుకుంది. ఇదే సమయంలో మంచిర్యాల ఇన్స్ పెక్టర్ ఆధ్వర్యంలో ప్రైవేటు గెస్ట్ హౌజ్ పై దాడి చేసి విటులను పట్టుకున్నారు. ఈ దాడుల్లో రూ. 12000 నగదు, మొబైల్ ఫోన్లు, కండోమ్స్, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. శంకర్ రెండు నెలలుగా వివిధ ప్రాంతాల్లోని బాధిత మహిళలను మంచిర్యాల గెస్ట్ హౌజ్ కు రప్పించి వ్యభిచారం చేయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇన్స్పెక్టర్ బన్సీలాల్, ఎస్ ఐ సురేష్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.