కలెక్టర్ కు ఫిర్యాదు
కలెక్టర్ మేడం గారు మా గ్రామంలో వీధి కుక్క ఇబ్బందులకు గురిచేస్తోంది… దానిని పెంచి పోషిస్తున్న వార్డ్ మెంబర్ పట్టించుకోవడం లేదు… దీంతో తమ ఇంటి ఆవరణలో ఉన్న కూరగాయల మొక్కలు దెబ్బతింటున్నాయి, కోడి పిల్లలు చచ్చిపోతున్నాయంటూ ఫిర్యాదు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
జగిత్యాల ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ లో సోమవాకం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన అశోక్ జిల్లా కలెక్టర్ ను కలిసి ఓ వినతిపత్రం అందించారు. తమ గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ దశరథం పెంచి పోషిస్తున్న శునకం వల్ల తమకు నరకం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి వాక్సినేషన్ కూడా చేయకపోవడంతో తమ పిల్లలను బయటకు పంపాలంటే భయపడిపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వార్డ్ మెంబర్ దశరథం పై చర్యలు తీసుకోవడంతో పాటు కుక్కను కట్టడి చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఆ వినతిపత్రంలో కోరారు. గ్రామంలో పరిష్కరించుకోవాల్సిన ఈ అంశంపై ఇక్కడి వరకు రావడం అవసరమా అంటూ కలెక్టర్ అశోక్ ను ప్రశ్నించారు. దశరథంను అడిగితే దిక్కున్న చోట చెప్పుకో పో అంటున్నాడని అశోక్ కలెక్టర్ కు వివరించాడు. ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. కుక్కతో తమ కోడి పిల్లలు, తమ పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెల్లదీస్తున్నారని ప్రజావాణిలో చేసిన ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది.