పామును తెచ్చి… పరేషాన్ చేసి…

అల్వాల్ లో బాధితుని అసహనం

దిశ దశ, హైదరాబాద్:

కుండపోతగా కురుస్తున్న వాన… వరద నీటి మయమైన కాలనీల్లో జీవించడమే గగనంగా మారింది మహానగర్ వాసులకు. ఓ వైపును మురుగు నీరు… మరో వైపున వరద నీరు ఇండ్లలోకి వచ్చి చేరుతుంటే క్షణమొక యుగంలా గడుపుతున్నారు జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని కాలనీల వాసులు. ఇందుకు తోడు పాములు కూడా ఇంటిలోకి చొరబడుతుండడంతో తమను కాపాడండి మహా ప్రభో అంటే జీహెచ్ఎంసీ అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. చివరకు విసుగు చెందిన ఆ యువకుడు జీహెచ్ఎంసీ అధికారులకు షాక్ ఇచ్చాడు. అల్వాల్ ఏరియాకు చెందిన సంపత్ అనే అతని ఇంట్లోకి మురుగు, వరద నీటితో పాటు ఓ పాము కూడా చొరబడింది. దీంతో పాము బెడద నుండి కాపాడాలని జీహెచ్ఎంసీ అధికారులను అభ్యర్థించాడు. ఆరు గంటలు గడిచినా బల్దియా అధికారుల నుండి స్పందన రాకపోవడంతో విసుగు చెందిన సంపత్ పామును తీసుకొచ్చి అల్వాల్ వార్డు ఆఫీసు టేబుల్ పై వదిలేశాడు. పాము వల్ల తాము చుక్కలు చూస్తున్నామని చెప్పిన పట్టించుకోకపోవడంతో దానిని అధికారుల ముందు ఉంచితే వారికెలాంటి ఫీలింగ్ కల్లగుతుందో ప్రాక్టికల్ గా చూపించాడు. దీంతో అల్వాల్ వార్డు కార్యాలయంలో పని చేస్తున్న బల్దియా సిబ్బంది ఒక్క సారిగా షాకుకు గురయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన గురించి నెటిజన్లు మాత్రం నిద్ర మత్తులో ఉన్న బల్దియా అధికారులను తట్టిలేపుతున్నట్టుగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ యంత్రాంగం పనితీరుకు ఈ ఘటన అద్దం పట్టిందని చెప్పాలి.

You cannot copy content of this page