ఆస్తులు పంచుకుని… అప్యాయతను తెంచుకుని…

అంత్యక్రియలు చేయని వారసులు

సుమోటో కేసు నమోదు

దిశ దశ, జగిత్యాల:

పెద్ద నాన్న, పెద్దమ్మల ఆస్తులు పంచుకున్న ప్రబుద్దులు ఇద్దరు అవ్వ అంత్యక్రియలు నిర్వహించేందుకు విముఖత చూపారు. మృతదేహాన్ని ఇంట్లోకి కూడా తీసుకెళ్లకుండా అవమానించారు. దీంతో అన్నదమ్ములిద్దరిపై సుమోటో కేసు నమోదు చేశారు జగిత్యాల టౌన్ పోలీసులు. జగిత్యాల పట్టణానికి చెందిన సత్తవ్వ బాగోగులు చూసుకోవల్సింది తప్పించుకున్న తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

సుమోటో కేసు…

సత్తవ్వ మరణించిన తర్వాత కూడా ఆఖరి మజిలీ నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించారు. ఐదు గంటలకు పైగా శవాన్ని అంబులెన్స్ లోనే ఉంచారు. సత్తవ్వ సొంత ఇంట్లోకి కూడా శవాన్ని రానివ్వకుండా తాళం వేశారన్న సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వారిని ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఓ కొడుకు సత్తవ్వ వద్దకు రాకపోగా… మరో కొడుకు అంత్యక్రియలు చేసేందుకు ససేమిరా అన్నాడు. దీంతో ఈ ఘటనపై 301BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు జగిత్యాల టౌన్ పోలీసులు. సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచనున్నారు. కేంద్రం 2011లో కఠిన తరం చేసిన ఈ చట్టం ప్రకారం జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

ఆస్తులూ…

సత్తవ్వ మరణించిన తర్వాత ఆమె మృతదేహం పట్ల అవమానపర్చే విధంగా వ్యవహరించిన అన్నదమ్ములపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతోనే సరిపెట్టలేదు పోలీసులు. సత్తవ్వ ద్వారా సంక్రమించిన ఆస్తులు కూడా స్వాధీనం చేసుకునే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆస్తులు కాజేసి అవసాన దశకు చేరుకున్న వృద్దుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. ఆర్డీవో నేతృత్వంలోని ట్రిబ్యునల్ లో విచారణ చేయనున్నారు. వృద్దులకు సంబంధించిన ఆస్తులపై వారసులకు హక్కులు లేకుండా ఆదేశాలు ఇచ్చే అధికారం ఆర్డీఓలకు ఉంది. ఈ విశేష అధికారాలను ఉపయోగించి సత్తవ్వ ఆస్తులు తమ పేరిట మార్పిడి చేసుకున్న వారి హక్కులను రద్దు చేయాలని పోలీసులు సిఫార్సు చేయనున్నట్టు సమాచారం.

You cannot copy content of this page