దిశ దశ, కరీంనగర్:
అసోసియేషన్ ఏర్పాటయినప్పటి నుండి సాగుతున్న ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్దమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కారాలు, మిరియాలు నూరుతున్న సభ్యులు గురువారం నాటి సమావేశంలో నిరసనలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కమాన్ పూర్ మెయిన్ రోడ్డుపై ఉన్న అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో సంఘం ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఎన్నికలు జరకుండా కమిటీని యథావిధిగా కొనసాగించడానికి కారణం ఏంటని కొంతమంది సభ్యులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సభ్యులతో నిర్ణయాలతో సంబంధం లేకుండా అసోసియేషన్ డబ్బులును వృథాగా ఖర్చు చేశారంటూ మరికొంతమంది ఆరోపించినట్టు సమాచారం. వెంటనే సంఘం ఎన్నికలు జరిపించాల్సిందేనని పట్టుబట్టడం సంచలనంగా మారింది. కొత్తపల్లి మండల పరిధిలోని ఎలగందుల, కమాన్ పూర్, బావుపేట తదితర గ్రామాల్లో వందల సంఖ్యలో గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ కోసం ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీల యజమానులు అంతా కలిసి అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇంతకాలం సంఘం బాధ్యులు వ్యవహరించిన తీరుపై కిమ్మనకుండా ఉన్న సంఘం ప్రతినిధులు తాజాగా గురువారం నాటి సమావేశంలో మాత్రం తమలోని ఆక్రోషాన్ని వెల్లగక్కడం సంచలనంగా మారింది. దాదాపు నెల రోజులుగా సమావేశాన్ని వాయిదా వేస్తూ వస్తుండగా ఈ రోజు మీటింగ్ జరగడంతో 10 మంది సభ్యులు కమిటీ తీరును తప్పుపట్టినట్టుగా సమాచారం.
గంగులకు మరో షాక్…
అయితే గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కమిటీ విషయంలో తీసుకున్న నిర్ణయాలతో మాజీ మంత్రి గంగుల కమలాకర్ కు మరో షాక్ తగిలినట్టయింది. ఈ కమిటీకి అధ్యక్షునిగా ఆయన బావ శంకర్, అన్న కొడుకు గంగుల ప్రదీప్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కమిటీ సమావేశంలో ఎన్నికలు నిర్వహించాలన్న నినాదం బలంగా వినిపించడం చర్చనీయాంశంగా మారింది.
dishadasha
1232 posts