దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో విలీన గ్రామాల అంశంపై రచ్చ సాగుతోంది. కలపాలన్న ప్రతిపాదనలు తెరపైకి రావడంతో ఆయా గ్రామాల ప్రజలు అందుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కార్పోరేషన్ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో సమీపంలోని గ్రామాలను విలీనం చేయాలన్న యోచనలో అధికార పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది.
మంత్రి పొన్నం ప్రతిపాదన…
కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్, దుర్శేడు, గోపాలపూర్, చింతకుంట, లక్ష్మీపూర్, మల్కాపూర్, కొత్తపల్లి మునిసిపాలిటీలను కరీంనగర్ బల్దియాలో కలపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. ఈ లేఖ కాస్తా వైరల్ కావడంతో ఆయా గ్రామాల్లో నిరసనలు మొదలయ్యాయి. అయితే ప్రభుత్వం కూడా సమీప గ్రామాలను కార్పోరేషన్ లో కలిపేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.
ప్రజల వాదన…
దుర్శేడు, గోపాలపూర్ గ్రామాల వాసులు కార్పోరేషన్ లో విలీనం చేయడం పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం వైపు రియల్ ఎస్టేట్ అంతగా విస్తరించలేదని, నేటికీ వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నామంటూ ఈ రెండు గ్రామాల ప్రజలు అంటున్నారు. అయితే గోపాలపూర్ గ్రామంలో ఎక్కువగా కూరగాయలు పండిస్తుంటారు. దశాబ్దాల కాలంగా కూడా గోపాలపూర్ నుండి కరీంనగర్ వాసులకు ఎక్కువగా కూరగాయలు రవాణా అవుతుంటాయి. అలాగే దుర్శేడు గ్రామంలో వరితో పాటు ఇతరాత్ర పంటలు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయంపై ఆధారపడి ఉన్న తమ గ్రామాలను విలీనం చేయాడం సరికాదని అంటున్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమ గ్రామాలను కార్పోరేషన్ లో విలీనం చేయకూడదని అప్పటి మంత్రి ఎమ్మెస్సార్ ను కలిసి విన్నవించుకోగా సానుకూలంగా స్పందించారని కూడా చెప్తున్నారు. అర్బన్ ఏరియాలో కలిపినట్టయితే రానున్న కాలంలో రియల్ ఎస్టేట్ రంగం విస్తరించడంతో వ్యవసాయంపై జీవనం సాగిస్తున్న తాము ఉపాధిని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపున కొత్తపల్లి మునిసిపాలిటీ ప్రత్యేకంగా ఏర్పాటయిందని ఇప్పుడు కార్పోరేషన్ లో కలపాలన్న ప్రతిపాదన సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బొమ్మకల్ గ్రామం కూడా కలపకూడదని, గ్రామపంచాయితీగానే కొనసాగించాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు.
ఉపాధి హామీ కూడా ఉండదు…
అలాగే కార్పోరేషన్ పరిధిలో తమ గ్రామాలను కలపడం వల్ల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకానికి కూడా బ్రేకులు పడతాయన్న ఆందోళన వ్యవసాయ కార్మికుల్లో వ్యక్తం అవుతోంది. గోపాలపూర్, దుర్శేడు గ్రామాల్లో 1500లకు పైగా జాబ్ కార్డ్స్ ఉన్నాయని, కార్పోరేషన్ లో విలీనం అయిన తరువాత ఉపాధి హామీ ఉపాధి అందే అవకాశం లేదని అంటున్నారు. వ్యవసాయ భూములను కమర్షియల్ అవసరాల కోసం వినియోగిస్తున్న ఇతర గ్రామాలను కలిపినట్టయితే బావుంటుంది కానీ, కేవలం వ్యవసాయంపై ఆధారపడ్డ తమ గ్రామాలను విలీని చేయాలన్న ప్రతిపాదన వల్ల తమకు తీరని నష్టం వాటిల్లుతుందని అంటున్నారు.