దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నిరసన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసుకునేందుకు క్యాబినెట్ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడి ఉన్నదన్న కారణంగా ఈ బిల్లును ఆమోదం కోసం గవర్నర్ కు పంపించింది ప్రభుత్వం. అయితే లీగల్ ఓపినియన్ కోసం తీసుకున్న తర్వతే బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపుతారని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. దీంతో ఆర్టీసీ కార్మికులు నిరసన బాట పట్టి గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. 43 వేల మంది ఉద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశాన్ని గవర్నర్ పెండింగ్ లో పెట్టారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు అండగా ప్రభుత్వం నిలవాలని చూస్తున్నా గవర్నర్ అడ్డుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్న కార్మికులు శనివారం రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును వెంటనే గవర్నర్ ఆమోదించినట్టయితే అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెడుతుందని కార్మికులు అంటున్నారు. తమకు అన్యాయం చేసే విధంగా వ్యవహరించవద్దంటూ కార్మికులు వేడుకుంటున్నారు. శనివారం ఉదయం 8 గంటల వరకూ బస్సులు బంద్ చేసి తమ నిరసనలు తెలపాలని నిర్ణయించడంతో ఆర్టీసీ డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అనంతరం కార్మికులు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నందున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీలో నిరసనల హోరు మిన్నంటి పోయింది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post