దిశ దశ, హైదరాబాద్:
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రంలో సాక్షాత్కరిస్తోంది. అప్పుడు ప్రతిపక్ష పార్టీ అంటేనే అల్లంత దూరంలో ఉంచిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రోటోకాల్ అంటూ రచ్చరచ్చ చేస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో గులాభి పార్టీ ఇంఛార్జీలతోనే అధికారిక కార్యక్రమాలు నిర్వహించి చరిత్ర సృష్టించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్న తీరు అందరినీ విస్మయపరుస్తోంది. రాష్ట్రంలో పలుచోట్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆరోపణలు చేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అయితే పలుమార్లు పంచాయతీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రోటోకాల్ రగడ సృష్టిస్తున్న తీరే హాట్ టాపిక్ గా మారింది.
అప్పుడలా…
బీఆర్ఎస్ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడిని హస్పిటల్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో అధికారికంగా ఆహ్వానించి చరిత్ర సృష్టించారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మహదేవపూర్ గ్రామపంచాయతీ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించడం లేదని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయితే అధికారిక కార్యక్రమం అయినందున ప్రోటోకాల్ విస్మరించవద్దని, ప్రారంభోత్సవం వాయిదా వేయాలని అధికారులు ఆదేశించారు. అయినప్పటికీ ప్రారంభోత్సవాన్ని మాత్రం వాయిదా వేయలేదు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తరువాత అధికారులు స్వేఛ్ఛ ప్రపంచంలోకి వచ్చారన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను గత ప్రభుత్వ హయాంలో విస్మరించారని ఆయన వ్యాఖ్యానించారు. హుజురాబాద్ బై పోల్ తర్వాత తనకు ఏమాత్రం సంబంధం లేకుండానే అధికారిక కార్యక్రమాలు జరిగిపోతున్నాయని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అయినా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అయినా ఏ అధికారిక కార్యక్రమం అయినా ప్రోటోకాల్ పట్టించుకున్న పాపాన పోలేదు. అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రజాప్రతినిధులుగా గెలవకున్న అధికారిక కార్యక్రమాలు చేపట్టిన సందర్భాలు కోకొల్లలు. అధికార పార్టీ నాయకులకే అన్నింటా ప్రాధాన్యత ఇవ్వాలంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినప్పుడు ప్రోటోకాల్ విస్మరించింది ఎవరో అన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవల్సిన అవసరం ఉంది. హుజురాబాద్, దుబ్బాక, హుజూర్ నగర్ తదితర ఉప ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం చేసిన సందర్భాలు సాధారణంగా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు ఎంత సేపు సమయం కెటాయించారు…? అధికార పక్షం విపక్ష సభ్యులను హేలన చేసిన తీరు తెలంగాణ సమాజం కళ్లారా చూసింది. స్పీకర్ గా ఎన్నికైన వారు స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలూ లేకపోలేదు. కానీ ఇప్పుడు మాత్రం స్పీకర్ కు బాధ్యతలు గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు.
ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ప్రోటోకాల్ అంటూ వల్లె వేయడం అత్యంత విచిత్రంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలన్న సూచనలు చేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇదే అంశాన్ని లేవనెత్తుతుండడం విడ్డూరం.