ప్రోటోకాల్ ఎందుకు… మహిళా రిజర్వేషన్ ఎందుకు..?

మండిపడ్డ మహిళా ఎంపీపీ…

వడగండ్ల బీభత్సంతో అతలాకుతలం అయిన ప్రాంతాలను సందర్శించి రైతాంగానికి బాసటగా నిలిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో హెడ్ క్వార్టర్ ఎంపీపీని అడ్డుకున్నారంటూ మహిళా ఎంపీపీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కవిత ఆవేదనకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లోకల్ ఎంపీపీని అయి ఉండి తనను అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట తన వెహికిల్ పంపించినప్పటికీ సీఎంను కలిసే అవకాశం ఇవ్వలేదని, కనీసం ఆయనకు నమస్కారం కూడా పెట్టనివ్వలేదని అలాంటప్పుడు ఎందుకు ప్రోటోకాల్ అనడం, రిజర్వేషన్లు ఎందుకిచ్చుడు అంటూ కవిత ప్రశ్నించారు. ఎక్కడైనా పోలీసులు ఆపుతున్నారంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపున చిప్పకుర్తి సర్పంచ్ అయిన తన భార్యను తనను కూడా స్థానిక పోలీసులు ముఖ్యమంత్రి పర్యటనలో కలవనీయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. రైతాంగ సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. ప్రకృతి బీభత్సంతో నష్టపోయిన రైతులను ఓదార్చేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ పర్యటన కాస్తా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఆగ్రహానికి గురి కావడం గమనార్హం. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ వద్దకు ఎవరెవరిని పంపించాలి, పంటలను పరిశీలించేప్పుడు ఎవరు ఉండాలి, మీడియాతో మాట్లాడినప్పుడు ఎవరు ఉండాల్సి ఉంటుంది అన్న ప్రోటోకాల్ ఖచ్చితంగా ఉంటుందని అలాంటప్పుడు హెడ్ క్వార్టర్ ఎంపీపీకే అవకాశం లేకుండా పోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

You cannot copy content of this page