యూజీగా మారిన మాజీ…

చందాల వసూళ్లకు రంగంలోకి దిగి…

కటకటాపాలైన వైనం

దిశ దశ, భూపాలపల్లి:

అరణ్యం వీడి జనారణ్యంలో కలిసిన ఓ మాజీ వేరే వారితో జట్టుకట్టి చందాల వసూళ్లే లక్ష్యంగా రంగంలోకి దిగాడు. ఈజీగా మనీ ఎర్న్ చేయాలన్న లక్ష్యంతో ఆర్థికంగా ఉన్న వారిని టార్గెట్ చేసుకుని కార్యరంగంలోకి దూకిన ఈ ముఠా గుట్టును ముచ్చటగా మూడు రోజుల్లో పోలీసులు రట్టు చేసేశారు. అధికార పార్టీ నాయకుని ఇంటికి వెల్లి మరీ హెచ్చరించి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారన్న విషయం వెలుగులోకి రావడంతో మావోయిస్టులు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చారేమోనని పోలీసులు అప్రమత్తం అయ్యారు. అసలే మహారాష్ట్ర, చత్తీస్ గడ్ సరిహద్దునే ఉన్న ప్రాంతం కావడంతో కాఖీలు అలెర్ట్ అయి టాయ్ పిస్తోళ్లతో బెదిరింపులకు గురి చేస్తున్న ఐదుగురి ముఠాను పట్టుకున్నారు.

కాళేశ్వరం పోలీసులు అరెస్ట్ చేసిన వసూళ్ల ముఠా

బుధవారం రాత్రి..

ఈ నెల 26వ తేది బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం సర్పంచ్ భర్త వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి ఇంటికి చేరుకున్న గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. తుపాకులు చూపించిన అగంతకులు మావోయిస్టుల పేరిట లేఖ రాసిచ్చి రూ. 50 లక్షలు పార్టీ ఫండ్ ఇవ్వాలని హెచ్చరించి వెళ్లిపోయారు. ఆ తరువాత నాగారం సర్పంచ్ రాజిరెడ్డి ఇంటికి వెల్లి రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుపాకులతో ముఠా సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చిందన్న విషయం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. నక్సల్స్ కార్యకలాపాలు ఉన్న సమయంలో మాత్రమే సాయుధుల సంచారం తప్ప ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఇలాంటి ముఠాల కదలికలు లేకపోవడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన కాటారం సబ్ డివిజన్ పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఈ ఘటనకు పాల్పడింది మావోయిస్టులా లేక స్థానికులా అన్న అనుమానంతో కూపీ లాగిన పోలీసులు చివరకు స్థానికంగా ఏర్పడిన ఓ ముఠా అని గుర్తించారు. సాంకేతిక సహాకారంతో పాటు ఇన్ ఫార్మర్ వ్యవస్థ ద్వారా ఐదుగురు నిందితులు వేసిన భారీ స్కెచ్ కు ఆదిలోనే బ్రేకులు వేశారు భూపాలపల్లి జిల్లా పోలీసులు. నిందితుల నుండి ఓ షిప్ట్ కారు, ఒక బైకు, నాలుగు జిలిటెన్ స్టిక్స్, రెండు టాయ్ పిస్తోళ్లు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాగ్రి, సెల్ ఫోన్స్

రెక్కి నిర్వహించి మరీ…

ఈ నెల 24న ఈ ముఠా సభ్యులు మహదేవపూర్ మండలం కాళేశ్వరం సర్పంచ్ భర్త వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా నాగారం సర్పంచ్ పిన్ రెడ్డి రాజిరెడ్డి ఇంటి పరసరాల్లో సంచరించి రెక్కి నిర్వహించారు. 26న కాళేశ్వరం, నాగారం సర్పంచు ఇండ్లకు వెల్లి వార్నింగ్ ఇచ్చిన ఈ ముఠా సభ్యులు మరు నాడు కోనంపేట ఎక్స్ రోడ్డుకు చేరుకుని నాగారం సర్పంచ్ రాజిరెడ్డికి ఫోన్ చేసి రూ. 5 లక్షలు తీసుకరావాలని ఫోన్ చేశారు. అయితే రాజిరెడ్డి అక్కడకు వెళ్లకపోవడంతో ఎదురు చూసి ముఠా వెల్లిపోయింది. శనివారం కాళేశ్వరం సర్పంచ్ భర్ మోహన్ రెడ్డి వద్ద చందా వసూలు చేయాలని వెల్తున్న క్రమంలో పోలీసులకు చిక్కారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో భూపాలపల్లి కార్ల్ మార్క్స్ కాలనీలో నివాసం ఉంటున్న మహదేవపూర్ మండలం అంబట్ పల్లికి చెందిన వావిళ్ల జనార్దన్ (50) ఆజంనగర్ కు చెందిన పులిగామ సతీష్ (32), బీరెల్లి నర్సయ్య (39), ములుగు జిల్లా బండారిపల్లిలో బ్రిక్స్ ప్లాంటులో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న పెండెం రాజేంద్ర ప్రసాద్ (44), కాల్వపల్లికి చెందిన ఆలెం సమ్మయ్య (36)లు ఉన్నారు.

చందాల వసూళ్ల ముఠా వివరాలను వెల్లడిస్తున్న ఎస్సీ సురేందర్ రెడ్డి

కఠిన చర్యలు: ఎస్పీ సురేందర్ రెడ్డి

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎస్సీ జె సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు. జనజీవనానికి ఆటంకం కల్గిస్తే సహించేది లేదని, సన్మార్గంలో జీవనం సాగించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టుల పేరిట వసూళ్లకు పాల్పడేందుకు స్కెచ్ వేసిన ముఠాను పట్టుకోవడంలో సఫలం అయిన మహదేవపూర్ సీఐ టి కిరణ్, ఎస్సైలు లక్ష్మణ్ రావు, భవాని సేన్, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, కానిస్టేబుళ్లు బాల్ సింగ్, తిరుపతి, కిరణ్, శ్యామ్, మధు, అన్వేష్, రాజశేఖర్, ధనుంజయ, ఐటీ కోర్ టీం వేణులను ఎస్సీ సురేందర్ రెడ్డి అభింనందించారు. ఈ మీడియా సమావేశంలో కాటారం, భూపాలపల్లి డీఎస్సీలు జి రామ్ మోహన్ రెడ్డి, అడ్లూరి రాములులు పాల్గొన్నారు.

You cannot copy content of this page