ఆ గ్రానైట్ క్వారీలపై కఠినంగా వ్యవహరించండి…

బ్లాక్ చేసినా తవ్వకాలు జరుగుతున్నాయా..?

టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి కట్టడి చేయండి

మైన్స్ డైరక్టర్ సురేంద్ర మోహన్ ఆదేశాలు

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలో మైనింగ్ మాఫియాను కట్టడి చేసే పరిస్థితి లేకుండా పోయిందా..? అధికారులు బ్లాక్ చేసిన క్వారీల్లోనూ తవ్వకాలు జరుగుతున్నాయా..? రికార్డుల్లో మాత్రమే ఆయా క్వారీల్లో  తవ్వకాలు జరపడం లేదని చూపిస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారా..? తాజాగా మైన్స్ అండ్ జియోలాజీ డైరక్టర్ సురేంద్ర మోహన్ విడుదల చేసిన ఓ లేఖ ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నట్టుగానే ఉంది. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం వెల్లడంతో కట్టడి చర్యలు చేపట్టాలని స్టేట్ డైరక్టర్ ఆదేశాలు జారీ చేశారంటే కనీసం బ్లాక్ చేసిన రీచులపై కూడా జిల్లా స్థాయి మైనింగ్ అధికారుల అజమాయిషీ లేకుండా పోయిందని స్పష్టం అవుతోంది. 

261 క్వారీలు బ్లాక్…

రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, హన్మకొండ, జనగామ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, యాదాద్రి జిల్లాల్లోని 261 క్వారీలను గతంలో బ్లాకు చేశారు మైనింగ్ అధికారులు. అయితే బ్లాక్ చేసిన క్వారీల నుండి అక్రమ మైనింగ్ చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని డైరక్టర్ ఆ లేఖలో పేర్కొన్నారు. బ్లాక్ చేసిన ఈ క్వారీల నుండి అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని కట్టడి చేసేందుకు జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని డైరక్టర్ ఆధేశించారు. ఆయా క్వారీలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారా లేదా నిర్దారించుకుని కనెక్షన్లు కట్ చేయించాలని సూచించారు. సదరు క్వారీల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు, ఎస్పీ, కమిషనర్ కార్యాలయలకు అనుసంధానం చేయాలన్నారు. ఆయా జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్ లోని పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్, డైరక్టరేట్ మైన్స్ అండ్ జియోలాజీ, టీఎస్ఎండీసీ కార్యాలయానికి కూడా అనుసంధానం చేయాలని ఆధేశించారు. బ్లాక్ చేసిన క్వారీల్లో అక్రమ మైనింగ్, రవాణా చేసే విధానాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయాం దారి మల్లకుండా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం జిల్లాల్లో ఏర్పాటు చేసే టాస్క్ ఫోర్స్ బృందాలు బ్లాక్ చేసిన క్వారీల లీజులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మైన్స్ అండ్ జియోలాజి విభాగంలోని జిల్లా స్థాయి అధికారులు ఈ విషయంలో ఏమైనా తప్పని గుర్తిస్తే వెంటనే క్రమశిక్షణ చర్యులు తీసుకునేందుకు అవసరమైన నివేదిక పంపించాలని కూడా సూచించారు.

టాస్క్ ఫోర్స్…

బ్లాక్ చేసిన క్వారీల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిరోధించేందుకు రెవెన్యూ, పోలీసు, మైన్స్ అండ్ జియోలాజి, రవాణా, అటవీశాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ కమిటీలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలని డైరక్టర్ సురేంద్ర మోహన్ ఆదేశించారు.

You cannot copy content of this page