భారత్ జోడో యాత్రలో భాగంగా మొన్నటి వరకు గడ్డం, ఒత్తయిన జుట్టుతో కనిపించిన రాహుల్ గాంధీ, ఇప్పుడు ట్రెండీ లుక్స్ తో కనిపించారు. మంగళవారం లండన్ చేరుకున్న రాహుల్ గాంధీ, ఒక వారం పాటు అక్కడ పర్యటించనున్నారు. ఆ తదుపరి కేంబ్రిడ్జి యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించనున్న రాహుల్, కేంబ్రిడ్జ్ బిజినెస్ స్కూల్(కేంబ్రిడ్జ్ జేబీఎస్)ని కూడా సందర్శించి..అక్కడ 21వ శతాబ్దపు లెర్నింగ్ టు లిసన్ అనే అంశంపై ప్రసంగించనున్నారు. కేం బ్రిడ్జ్‌లో బిగ్ డేటా అండ్ డెమోక్రసీ, ఇండియా-చైనా సంబంధాలు అనే అంశంపై యూనివర్సిటీ కార్పస్ క్రిస్టీ కాలేజ్ ట్యూటర్ అండ్ కోడైరెక్టర్, గ్లోబల హ్యూమానిటీస్ ఇనిషియేటివ్ డైరెక్టర్ అయిన శ్రుతి కపిలాతో కలసి కొన్ని సెషన్‌లు కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ట్విట్టర్ వేదికగా భారత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది అని పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ గెటప్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ట్రెండింగ్ గా మారింది.