దిశ దశ, హైదరాబాద్:
యువత భవితను నాశనం చేస్తున్న డ్రగ్స్ వినియోగంపై తెలంగాణలో ఉక్కుపాదం మోపడం ఆరంభం అయింది. ఇంతకాలం యథేచ్ఛగా డ్రగ్స్, గంజాయి దందాలు సాగడంతో మత్తులో జోగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుండి మెట్రో సీటీ వరకు ప్రతి చోట కూడా మత్తు పదార్థాల గుభాళింపు విపరీతంగా పెరిగిపోయింది. ఓ వైపున అంతర్జాతీయ స్థాయిలో అభ్యున్నతి వైపు దూసుకపోతున్నామని చెప్పుకుంటేనే మరో వైపున బంగారు భవిత ఉన్న వారంతా డ్రగ్స్ కు అడిక్ట్ అయి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు ముంబాయిలాంటి ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం తీవ్రంగా ఉండగా ఇప్పుడు వాటి సరసన భాగ్యనగరం చేరడం ఆందోళన కల్గిస్తున్న విషయం. డ్రగ్స్ కంట్రోల్ యాక్ట్ నిర్వీర్యంగా మారిపోవడంతో చట్టాలు చేష్టలుడిగి చూస్తూ కాలం వెల్లదీశాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మాఫియాపై కొరడా ఝులిపించాలని నిర్ణయించడంతో కదనరంగంలోకి పోలీసులు దూకారు.
మహానగరంలో దాడులు…
డ్రగ్స్ వినియోగంపై పోలీసులు కన్నెర్రజేస్తున్నారు. ఆదివారం మద్యాహ్నం నుండే నార్కోటిక్ బ్యూరో అధికారులు డ్రగ్స్ కంట్రోల్ పై స్పెషల్ ఆపరేషన్లకు శ్రీకారం చుట్టారు. రాత్రి హైదరాబాద్ లోని రోడ్ 10, 36, 45లోని పబ్స్ లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. జాగిలాల సాయంతో తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు పబ్స్ నిర్వహాకులతో పాటు ఆయా పబ్స్ ను క్షుణ్నంగా తనిఖీలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో అటు నార్కోటిక్ బ్యూరో, ఇటు పోలీసు యంత్రాంగం అంతా కూడా దాడులకు శ్రీకారం చుట్టాయి. పబ్స్ తో పాటు డ్రగ్స్ క్రయవిక్రయాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం, రేవ్ పార్టీలపై కన్నెర్రజేయడం వంటి చర్యలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో మత్తు పదార్థల వినియోగం తీవ్రంగా పెరిగిపోయిన నేపథ్యంలో వాటిని నియంత్రించేందకు కఠిన చర్యలు తీసుకోకపోతే రానున్న వాటి వ్యతిరేక ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయని అంటున్నారు.
గతంలో అలా…
అంతకు ముందు కూడా హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం ఉన్నప్పటికీ విదేశీ విద్యార్థుల రూపంలో ఎక్కువగా మహానగరానికి చేరుకునేది. కానీ ఇప్పుడు స్థానికులు కూడా ఈ దందాలో భాగస్వాములు అయ్యారని గతంలో వెలుగులోకి వచ్చిన సంఘటనలు నిరూపిస్తున్నాయి. డ్రగ్స్ వినియోగం పేరిట రూ. కోట్లలో డబ్బులు చేతులు మారుతున్నాయన్న ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల కూడా డ్రగ్స్ కట్టడి చేయడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే తెలంగాణ అధికార యంత్రాంగం ఆరంభ శూరత్వానికే పరిమితం కాకుండా శాశ్వత ప్రాతిపదిన డ్రగ్స్, గంజాయి వంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.