పట్టుకునే క్రమంలో తప్పించుకున్నాడు… ఎస్ఐ కోరకు గాలిస్తున్నాం… ఏసీబీ

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లా రాయికల్ ఎస్సై అజయ్ లంచం తీసుకునే క్రమంలో తప్పించుకున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో రాయికల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి కరీంనగర్ ఏసీబీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం… మండలంలోని ఇటిక్యాలకు చెందిన గడ్డం రాజేందర్ ఇసుక రవాణా చేస్తుండగా రాయికల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నిందితునికి సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలన్న ఒఫ్పందం మేరకు ఎస్సై అజయ్ కి రూ. 25 వేలు ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. ఇందులో రూ. 15 వేలు ఇప్పటికే ఇవ్వగా మిగతా రూ. 10 వేలు ఇవ్వాల్సి ఉంది. దీంతో బాధితుడు గడ్డం రాజేందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో శుక్రవారం రాత్రి ఎస్సై అజయ్, మిడియేటర్ పుల్లూరి రాజులను పట్టుకునేందుకు వ్యూహం రచించారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి రాయికల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఏసీబీ అధికారులు మధ్యవర్తి నుండి డబ్బులు కలెక్ట్ చేసుకునేందుకు ఎస్సై అజయ్ ని పట్టుకోవాలని రంగం సిద్దం చేసుకున్నారు. అయితే ఈ కేసులో ఎస్సై అజయ్ స్టేషన్ ఆవరణకు చేరుకున్న తరువాత ఏసీబీ అధికారులను గమనించి లంచం డబ్బు తీసుకోకుండా తప్పించుకున్నాడు. దీంతో మిడియేటర్ గా ఉన్న పుల్లూరి రాజు లంచం తీసుకున్నట్టుగా కెమికల్ టెస్టులో కూడా తేలడంతో అతన్ని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్సై అజయ్ తప్పించుకున్నారని, అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

You cannot copy content of this page