అగ్గిపెట్టె ఆధారామా..? సీసీ ఫుటేజీ దొరికేనా..?

రాయపర్తి బ్యాంకు రాబరీ వెనక..?

దిశ దశ, వరంగల్:

తెలంగాణలో సంచలనం కలిగిస్తున్న ఈ రాబరీకి పాల్పడింది ఎవరూ..? దోపిడీ ముఠా పక్కాగా రెక్కీ నిర్వహించే దొంగతానానికి పాల్పడిందా..? ఈ ముఠాకు స్థానికుల  చేయూత అందిందా..? ఇలా ఎన్నెన్నో అనుమానాలు వెంటాడుతున్న ఈ ఘటన ఇప్పుడు పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఎస్బీఐ బ్రాంచ్…

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయంలోకి అగంతకులు చొరబడ్డారు. గ్యాస్ కట్టర్ లను తీసుకెళ్లి మరీ లాకర్ ను కట్ చేసి అందులో ఉన్న రూ. 14 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అయితే ఈ ఘటన జరిగిన తరువాత ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తే ఎదువుతున్న సవాళ్లు అన్ని ఇన్ని కావు. బ్యాంకులోకి చొరబడ్డ దొపిడీ దొంగలు బ్యాంకు వెనక ప్రాంతం నుండి లోపలకు వెల్లారని స్పష్టం అవుతోంది. అయితే దాదాపు ఏడు ఫీట్ల ఎత్తున ఉన్న ప్రహరి పైకి ఎక్కి బ్యాంకులోకి ఎలా వెళ్లారన్నదే అంతుచిక్కకుండా పోతోంది. బ్యాంకు పరిసర ప్రాంతాలను ముందు పసిగట్టినప్పటికీ కంపౌండ్ వాల్ ఎక్కి లోపలకు వెల్లడం మాత్రం అంత సులువైన పని కాదని స్పష్టం అవుతోంది. కేవలం దొంగలే కాకుండా వారి వెంట తీసుకొచ్చిన గ్యాస్ కట్టర్, సిలెండర్ కూడా ఇక్కడి నుండే బ్యాంకులోకి తీసుకెళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. బరువుగా ఉండే గ్యాస్ సిలిండర్ ను 7 ఫీట్ల ఎత్తు ఉన్న కంపౌండ్ వాల్ మీదుగా బ్యాంకులోకి ఎలాంటి సపోర్ట్ లేకుండా తీసుకెళ్లడం మాత్రం అసాధ్యమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. బ్యాంకులోకి చొరబడ్డ అగంతకులు బ్రాంచ్ కార్యాలయంలో పవర్ సప్లై నిలిపివేశి, స్ట్రాంగ్ రూమ్ తో అనుసంధానం చేసిన అలారం కనెక్షన్ కూడా తొలగించి దర్జాగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా బ్యాంకులో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ స్టోరేజ్ చేసిన డిజిటల్ వీడియో రికార్డర్ (DVR) బాక్స్ కూడా ఎత్తుకెళ్లారు. రాబరీకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా దర్యాప్తు చేసే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకున్నారని అనుమానిస్తున్నారు.

అదే ఆధారామా..?

అయితే బ్యాంకు లాకర్ ధ్వంసం చేసేందుకు గ్యాస్ కట్టర్ ను వినియోగించేందుకు నిప్పు కోసం ఓ అగ్గిపెట్టెను అగంతకులు వాడి ఉంటారని భావిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ లో లభ్యమైన ఈ అగ్గిపెట్టేను పరిశీలిస్తే మాత్రం దానిపై తమిళనాడు అధికారిక భాషకు సంబంధించిన పదాలు రాసి ఉండడంతో ఈ ముఠా ఆ రాష్ట్రం నుండే రాయపర్తికి చేరుకుందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా రాయపర్తి ఏరియాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించినట్టయితే అనుమానంగా సంచరించే వాహనాలను కానీ, అనుమానితులను కానీ గుర్తించే వీలు ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నామ మాత్రంగానే మిగిలిపోవడంతో వాటి ఫుటేజీ పోలీసుల దర్యాప్తునకు సహకరించే పరిస్థితి మాత్రం లేనట్టుగా తెలుస్తోంది. దీంతో సాంకేతికతను అందిపుచ్చుకుని సస్పెక్టెడ్ మొబైల్ నంబర్ల ఆధారాంగా దొంగల ముఠాను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో దొరికిన క్లూస్ ఆధారంగా గతంలో ఈ ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడిన ముఠాలు పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నప్పటికీ ఇది అంతరాష్ట్ర ముఠా పనే అయి ఉంటుందన్న అనుమానం బలంగా వినిపిస్తోంది.

అదెలా సాధ్యం..?

అయితే దోపిడీ జరిగిన రాయపర్తి బ్యాంకు పరిసర ప్రాంతాల్లో వాహనాలు కూడా వచ్చిన దాఖలాలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఒక వేళ ఇదే నిజమైతే గ్యాస్ సిలిండర్ ను, కట్టర్ ను బ్యాంకు వెనక భాగం వరకు ఎలా తీసుకెళ్లారన్నదే అంతు చిక్కడం లేదు. మరో వైపున బ్యాంకు లాకర్ నుండి ఎత్తుకెళ్లిన బంగారు ఆభరణాలను, డీవీఆర్ బాక్సును ఎలా తీసుకెళ్లారోనన్నదే పజిల్ గా మారింది. ఇదే తరహా ఘటన అక్టోబర్ చివరి వారంలో కర్ణాటక రాష్ట్రంలో కూడా జరిగిందని గుర్తించిన కమిషనరేట్ పోలీసు అధికారులు అక్కడి పోలీసు అధికారులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టుగా సమాచారం. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే… ఈ బ్యాంకులో వేరే లాకర్లు ఉన్నప్పటికీ కేవలం బంగారం స్టోర్ చేసి పెట్టిన ఒక్క లాకర్ ను మాత్రమే గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అంటే ఈ లాకర్ లోనే బంగారం నిలువ ఉంటుందన్న విషయాన్నిదోపిడీ ముఠా ఎలా పసిగట్టిందన్న విషయమే మిస్టరీగా మారింది.

గుంజపడుగా బ్యాంక్…

ఇదే తరహాలో రామగుండం కమిషనరేట్ పరిధిలోని గుంజపడుగ ఎస్బీఐ బ్యాంకులో రాబరీ జరిగింది. 2021 మార్చి 25న జరిగిన ఈ దోపిడీలో రూ. 3 కోట్లకు పైగా విలువైన బంగారం, నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. అయితే ఈ బ్యాంకు రాబరీ చేసినప్పుడు అగంతకులు బ్యాంకు వెనక ప్రాంతంలో ఉన్న చెట్లలో షెల్టర్ తీసుకున్నారని గుర్తించారు. అంతేకాకుండా చెట్లను నరికి బ్యాంకులోకి వెల్లేందుకు నిచ్చెనను అప్పటికప్పుడు తయారు చేసుకుని లోపలకు చొరబడి గ్యాస్ కట్టర్ తో లాకర్ బ్రేక్ చేసి దోపిడీకి పాల్పడ్డారు. అయితే అప్పుడు కూడా బ్యాంకులోని డీవీఆర్ బాక్సును ఎత్తుకెల్తున్న క్రమంలో అది బ్యాంకు వెనక ప్రాంతంలోని తుమ్మ చెట్లలో పడిపోయింది. ఈ విషయాన్ని దోపిడీ ముఠా గమనించకపోవడం… మరునాటి ఉదయం పోలీసులు పరిసర ప్రాంతాల్లో సెర్చ్ చేయడంతో డీవీఆర్ బాక్స్ లభ్యం కావడం కొంతమేర లాభించిందని చెప్పవచ్చు. అలాగే గ్యాస్ సిలెండర్ పై ఉన్న కోడ్ నంబర్ ఆధారంగా కూడా దర్యాప్తు చేయడంతో దానిని మహారాష్ట్రలోని చంద్రపూర్ సమీపంలోని ఓ గ్యాస్ వెల్డింగ్ సెంటర్ నుండి దొంగలించుకుని పోయారని గుర్తించారు. అంతేకాకుండా సీసీ కెమెరాల ఆధారంగా అనుమానంగా తిరుగుతున్న ఓ వాహనాన్ని గుర్తించిన పోలీసులు అది ఎటువైపు వెల్తుందో కూడా గుర్తించి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. దీంతో దొంగల ముఠాను పోలీసులు పట్టుకోవడంలో సఫలం అయ్యారు. కానీ ఈ ముఠాలోని ఒకరిద్దరు దొంగలు తమ వాటాలు తీసుకుని స్వస్థలాలకు వెల్లిపోయారు. వారిని కూడా పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాల్సి వచ్చింది. అయితే వీరు చంద్రపూర్ కు చెందిన ఒకరిద్దరిని మచ్చిక చేసుకుని అక్కడే షెల్టర్ తీసుకుని సమీప ప్రాంతాల్లోని బ్యాంకులకు కన్నం వేసేందుకు పథకం పన్నినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. తాజాగా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని రాయపర్తి బ్యాంకు రాబరీ కూడా ఇదే తరహాలో జరిగినప్పటికీ కొంత వైవిద్యత ఉంది. ఈ బ్యాంకు వెనక భాగంలో చాలా దూరం వరకు ఎలాంటి చెట్లు లేకపోవడంతో వారు ఎక్కడ షెల్టర్ తీసుకుని ఉంటారన్నదే అంతు చిక్కకుండా పోతోంది.

డంపింగ్ దిక్కా..?

రాయపర్తి బ్యాంకు రాబరీ విషయంలో టవర్ డంప్ సిస్టం ద్వారా అనుమానిత నెంబర్లను గుర్తించే అవకాశాలు ఉన్నాయి. రాయపర్తి ఏరియాలోని వివిధ కంపెనీలకు సంబంధించిన టవర్ల పరిధిలో లొకేట్ అయిన నంబర్లను గుర్తించి వాటిలో అనుమానిత నంబర్లపై నిఘా పెట్టి దొంగల ముఠాను పట్టుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా హైవైపై ఉన్న బ్యాంకులో రాబరీ చేయడం మాత్రం సంచలనంగా మారింది.

You cannot copy content of this page