పరారీలో మరికొందరు… భారీగా బంగారం స్వాధీనం
సవాల్ గా స్వీకరించిన వరంగల్ పోలీసులు
దిశ దశ, వరంగల్:
వరంగల్ కమిషనరేట్ లో సంచలనం కల్గించిన రాయపర్తి ఎస్బీఐ బ్యాంకు రాబరీ ఘటనను సవాల్ గా స్వీకరించిన పోలీసులు దొపిడీ ముఠాను పట్టుకోవడంలో సఫలం అయ్యారు. ఈ గ్యాంగులోని ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రాలకు చెందిన ఏడుగురు ముఠాగా ఏర్పడి దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. వీరిలో యూపీలోని బుడాన్ తాలుకా షేహవాజ్ పూర్ కు చెందిన అర్షాద్ అన్సారీ (34),షాఖీర్ ఖాన్ అలియాస్ బోలే ఖాన్ (28), మోటల గ్రామానికి చెందిన హిమాన్షు బిగాం చండ్ (30)లను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల నుండి రూ. కోటి 80 లక్షల 4 వేల విలువ చేసే 2.520 కిలోల బంగారు ఆభరణాలు, ఒక కారు, రూ. 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు. యూపీలోని బదౌన్ జిల్లా కక్రాలకు చెందిన మహ్మద్ నవాబ్ హసన్ (39), మహారాష్ట్రలోని చికిల్లి తాలుకా సైగావ్ కు చెందిన అక్షయ్ గజానన్ (24), బుల్తానా జిల్లా పున్తె మోటాలకు చెందిన సాగర్ భాస్కర్ గోర్ (32), యూపీలోని కక్రాలకు చెందిన సాజిద్ ఖాన్ (35)లు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. దొంగల ముఠాను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, సాంకేతికతతో పాటు పోలీసు సమాచార వ్యవస్థ ద్వారా నిందితులను పట్టుకున్నామని సీపీ వివరించారు. వెస్ట్ జోన్ డీసీపీ రాజ మహేంద్ర నాయక్ నేతృత్వంలో ఏసీపీలు నర్సయ్య, భోజరాజు, కిరణ్ కుమార్, ఆత్మకూర్, రఘునాథ్ పల్లి, సీసీఎస్, వర్ధన్నపేట, పాలకుర్తి, నర్మెట్ట, టాస్క్ ఫోర్స్, పీసీఆర్ ఇన్స్ పెక్టర్లు సంతోష్, శ్రీనివాసరెడ్డి, బాలాజీ వరప్రసాద్, శివకుమార్, రఘుపతి రెడ్డి, శ్రీనివాసరావు, మహేందర్ రెడ్డి, అబ్బయ్య, పవన్ కుమార్, విశ్వేశ్వర్, ఏఏఓ సల్మాన్ పాషాలతో పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బందిని దోపిడీ ముఠాను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల్లో నియమించామని సీపీ వివరించారు. వీరంతా కూడా ఎప్పటికప్పుడు దొంగల ముఠాల ఆచూకి కోసం ఆరా తీసి 16 రోజుల్లోనే పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారని సీపీ తెలిపారు.
గూగుల్ సహకారంతో…
ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రాలకు చెందిన ఈ దోపిడీ ముఠా వ్యాపారం చేస్తున్నామని చెప్పి హైదరాబాద్ లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. గుగూల్ మ్యాప్ సహకారంతో దోపిడీ చేసేందుకు అనువుగా ఉన్న బ్యాంకుల గురించి ఆరా తీశారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల వివరాలను సేకరించిన ఈ ముఠా చోరీకి పాల్పేడుందుకు అనువైన చోటును ఎంపిక చేసుకుంటారు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న మహమ్మత్ నవాబ్ హసన్ క్షేత్ర స్థాయిలో తిరుగుతూ రెక్కి నిర్వహించేవాడు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల వద్ద సంచరించి అక్కడ ఉన్న భద్రతా చర్యలు చోరీ చేసేందుకు ఎటువైపు నుండి చొరబడాలి అన్న సమగ్రమైన వివరాలను సేకరించుకునే వాడు. ఇందులో భాగంగానే రాయపర్తి బ్యాంకు రాబరీ చేయడం సులువుగా ఉంటుందని గుర్తించి మిగతా ముఠా సభ్యులతో కలిసి స్కెచ్ వేసుకున్నాడు.
పక్కా ప్లాన్…
నవంబర్ 18వ తేది రాత్రి రాయపర్తికి హిమాన్షు డ్రైవ్ చేస్తున్న కారులో ఈ ముఠా చేరుకుంది. రాయపర్తి శివారులోకి చేరుకున్న తరువాత కారును వెనక్కి పంపించి తెల్లవారు జామున 4 గంటలకు అదే స్పాట్ కు రావాలని చెప్పారు. అక్కడి నుండి మిగతా ఆరుగురు దొంగలు పంటల పొలాల మీదుగా ఎస్బీఐ బ్యాంకు దక్షిణం వైపునకు చేరుకున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో బ్యాంకు సమీపంలోకి వచ్చిన ఈ గ్యాంగ్ కిటికీని తొలగించి ఇద్దరిని అక్కడే కాపలా ఉంచి మిగతా వారు లోపలకు చొరబడ్డారు. ముందుగా బ్యాంకులో అమర్చిన సెక్యూరిటీ అలారానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పాటు సీసీ కెమెరా వైర్లను కూడా కట్ చేసేశారు. ఆ తరువాత బ్యాంకు స్ట్రాంగ్ రూం తాళాలు పగలగొట్టి అందులో ఉన్న మూడు లాకర్లను ఓపెన్ చేసేందుకు గ్యాస్ కట్టర్లను ఉపయోగించారు. గ్యాస్ కట్టర్ల ద్వారా లాకర్ ను బ్రేక్ చేసిన దుండగులు రూ. 13 కోట్ల 61 లక్షల విలువైన బంగారు ఆభరణాలను బ్యాగుల్లో నింపుకున్నారు. బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్ (DVR) బాక్సును కూడా తీసుకుని వెల్లిపోయారు. అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ లోని అద్దె ఇంటికి చేరుకున్న ఈ ముఠా సభ్యులు చోరీ సొత్తును ఏడు సమాన వాటాలుగా పంచుకున్నారు. నవంబర్ 19న మూడు బృందాలుగా విడిపోయిన ఈ ముఠా సభ్యులు ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రాల్లోని తమతమ స్వస్థలాలకు వెల్లిపోయారు.
అంచనా వేయడంలో…
బ్యాంకు రాబరీకి పాల్పడిన ఈ ముఠా దోపిడీ చేసే విషయంలో పకడ్భందీగానే స్కెచ్ వేసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. రాత్రి 11 గంటలకు కారులో ఆరుగురిని దింపి వెల్లిన హిమాన్షును తిరిగి 4 గంటల వరకు అక్కడకు చేరుకోవాలని సూచించారు. అంటే ముందుగానే బ్యాంకులో జరిపే దోపిడీ ఎంత సేపట్లో చేయగలుగుతాం, స్థానికులు, పోలీసుల కంట పడకుండా ఉండేందుకు ఏ సమయంలో బయటపడాలి అన్న విషయాలపై సమగ్రమైన అవగాహనతో ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం దోపిడీ దొంగల ముఠా సఫలం అయినప్పటికీ వరంగల్ కమిషనరేట్ పోలీసుల వలకు చిక్కకతప్పలేదు.