తెలంగాణను వదిలేసి ఏపీలో ఉద్యోగం చేయాలనుకున్నా… అదృశ్యం అయిన పంచాయితీ కార్యదర్శి సేఫ్

సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం కల్గించిన పంచాయితీ కార్యదర్శి అదృశ్యంలో పోలీసులు కార్య రంగంలోకి దిగి క్షేమంగా సిరిసిల్లకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఉన్నట్టుగా గుర్తించిన పోలీసు అధికారులు, సెక్రటరీ కుటుంబ సభ్యులు హుటాహుటిన తిరుపతికి చేరుకుని స్వస్థలానికి తీసుకొచ్చారు. గురువారం సిరిసిల్ల తీసుకొచ్చిన పోలీసులు కార్యదర్శి ప్రియాంక నుండి పూర్తి వివరాలు సేకరించారు.

ఆ నలుగురే…

అయితే సిరిసిల్లకు చేరుకున్న తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి కార్యదర్శి ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు. తాను వెల్లేప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టుగా ఉన్నతాధికారులకు వాట్సప్ ద్వారా సమాచారం పంపించానని, తెలంగాణాను వదిలేసి ఏపీలోనే ఉద్యోగం సంపాదించుకున్న తరువాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని భావించానన్నారు. అయితే తాను అదృశ్యం అయిన విషయంలో స్థానిక పోలీసులు తన లోకేషన్ గుర్తించి తిరిగి సిరిసిల్లకు తీసుకొచ్చారని వివరించారు. అయితే బద్దెనపల్లి గ్రామంలో నలుగురు వ్యక్తుల కారణంగా తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని, సంక్షేమ పథకాలకు సంబంధించిన జాబితాలు తయారు చేసే విషయంతో పాటు నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు ఇప్పించాలని తనపై ఒత్తిడి చేశారని ప్రియాంక ఆరోపించారు. గ్రామానికి చెంందిన గుగ్గిళ్ల శ్రీకాంత్, గుగ్గిళ్ల అభి, మల్లేశ్, రాజులు తన విధుల్లో జోక్యం చేసుకుంటూ వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన హయాంలో జరగని పనులకు, రికార్డుల్లో లేని పనులకు, అసలు పనులే చేయని నిర్మాణాలకు బిల్లులు చేసి తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారని ప్రియాంక వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తాము ప్రతిపాదించిన వారికే అవకాశం ఇవ్వాలని స్ఫష్టం చేశారని తానో ప్రభుత్వ అధికారిణి అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా బానిసలాగా చూశారన్నారు. 20 నెలలుగా బద్దెనపల్లి పంచాయితీ కార్యదర్శిగా పని చేస్తున్న తాను వీరు పెడుతున్న వేధింపులు తట్టుకోలేకపోయానని, గతంలో తనపై అధికారులకు కూడా ఈ విషయాలను వివరించానన్నారు. కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా తనను సంబోధించడమే కాకుండా ఎప్పుడూ తన కార్యాలయంలోనే కూర్చోనేవారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో తానే సర్పంచ్ అవుతానని ఇప్పటి నుండే తాను చెప్పినట్టుగా నడుచుకోవాలని కూడా హెచ్చరించారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకే విధుల్లో చేరినప్పటికీ నలుగురి కారణంగా మనోవేధనకు గురి కావల్సి వచ్చిందని కార్యదర్శి ప్రియాంక వెల్లడించారు. లబ్దిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవల్సి ఉన్నప్పటికీ వాటన్నింటిని పట్టించుకోకుండా తాము ప్రతిపాదించిన వారినే ఎంపిక చేయాలన్నారని, 2020లో నిర్మాణం చేసిన శ్మశాన వాటిక, ఇంకుడు గుంతలకు సంబంధించిన బిల్లులు ఇవ్వాలని ఒత్తిడీ చేశారని చివరకు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే చాలా చోట్ల ఇంకుడు గుంతలు కట్టలేదని తేలిందన్నారు. పంచాయితీ కార్యాలయం ద్వారా నిర్వహించే కార్యక్రమాల వివరాలు తమకు ముందుగా సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశించారని, ప్రజాప్రతినిధులు కాకున్నా తనపై అజమాయిషీ చేశారని అయినప్పటికీ ప్రతి విషయం గురించి వారికి తెలియజేశానని ప్రియాంక వివరించారు. లబ్దిదారుల ఎంపిక జాబితా విషయంలో తాను స్థానిక పాఠశాలలో కూర్చున్నప్పుడు ఆ వ్యక్తులే తయారు చేసి నాకు అప్పగించారని తెలిపారు. ఆ నలుగురు పెడుతున్నఇబ్బందులను తట్టుకునే పరిస్థితి లేకే పంచాయితీ తాళం చేతులు మరో ఉద్యోగికి అప్పగించి వాట్సప్ ద్వారా తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాని పై అధికారులకు సమాచారం ఇచ్చి వెళ్లిపోయానని ప్రియాంక వెల్లడించారు. అయితే సిరిసిల్ల పోలీసులు తిరుపతిలో ఉన్న తనను ట్రేస్ చేసి తీసుకోచ్చారని తెలిపారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తరువాతే ఏదైనీ నిర్ణయం తీసుకుంటానని ప్రియాంక స్పష్టం చేశారు.

You cannot copy content of this page