పేరెంట్స్ ను పట్టించుకోకుంటే అంతే… 2BHK రద్దు చేస్తూ నిర్ణయం…

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

తండ్రిని ఇంటి నుండి వెల్లగొట్టి పండగ పూట జల్సా చేద్దామనకున్న వారికి సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యూనల్ అధికారులు ఝలక్ ఇచ్చారు. కన్న తండ్రి బాగోగులు చూసుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చేతల్లోనే చూపించారు అక్కడి అధికారులు. చెట్టంత ఎదిగిన కొడుకులు ఉన్నా బుక్కెడు బువ్వ పెట్టే వారు లేక పక్షవాతంతో తల్లడిల్లిపోతున్న ఆ తండ్రి రక్త బంధం అక్కున చేర్చుకుంటుందేమోనని కలలు కన్నా లాభం లేకపోయింది. అద్దె ఇంట్లో అనారోగ్యంతో తల్లడిల్లుతున్న ఆ వృద్దుడు తనకు న్యాయం చేయాలని అధికారులకు ఆశ్రయించడంతో అతని వారసులకు షాకిచ్చారు అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన పేరెంట్స్ పట్ల వివక్ష చూపే వారసులకు పరోక్ష హెచ్చరిక పంపినట్టయింది. సంఘటనా వివారల్లోకి వెల్తే… అదుబాల రాజమల్లుకు ఇద్దరు కొడుకులు కాగా, కొంతకాలం క్రితం అతని భార్య మరణించింది. అప్పటి నుండి కొడుకుల వద్దే ఉంటున్న రాజమల్లును ఇటీవల అతని కొడుకులు ఇంటి నుండి వెల్లగొట్టడంతో బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పక్షవాతంతో బాధపడుతున్న రాజమల్లు పోలీసులను ఆశ్రయించి తన పట్ల వివక్ష చూపుతున్నారని, తానిప్పుడు బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు రాజమల్లు కొడుకులు అనిల్ కుమార్, సురేష్ లను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి తండ్రిని చూసుకోవాలని లేనట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకోవల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో సీనియర్ సిటిజన్ ట్రిబ్రూనల్ ఇంఛార్జిగా ఉన్న సిరిసిల్ల ఆర్డీఓ లోలావర్ రమేష్ విచారణకు ఆదేశించారు. తంగళ్లపల్లి తహసీల్దార్ జయంత్ కుమార్ అదువాల రాజమల్లు దీనస్థితిపై క్షేత్రస్థాయి విచారణ జరిపి ఆర్డీఓకు నివేదిక పంపించారు. అయితే స్థానిక కేసీఆర్ నగర్ లో రాజమల్లు పెద్ద కొడుకు అనిల్ కుమార్ భార్య పేరిట డబుల్ బెడ్రూం ఇంటిని గతంలో జిల్లా అధికారులు కెటాయించారు. అప్పుడు రాజమల్లుకు ఇంటిని కెటాయించాల్సి ఉన్నప్పటికీ ఒంటరి వాడు కావడంతో అతని బాగోగులు చూసుకునేందుకు తాను సిద్దంగా ఉన్నానని అనిల్ కుమార్ రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతో అతనికి డబుల్ ఇళ్లు కెటాయించారు. అయితే ఇటీవల రాజమల్లును ఇంటి నుండి వెల్లగొట్టడంతో పాటు అతనిపై కోడలు కూడా దురుసుగా వ్యవహరించింది. కన్న కొడుకులే తనను ఇంటి నుండి వెల్లగొట్టడంతో పక్షవాతంతో బాధపడుతూనే రాజమల్లు బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అధికారులను కలిసి తన గోడు వెల్లబోసుకోవడంతో సిరిసిల్ల ఆర్డీఓ సమగ్ర విచారణ జరిపించి అనిల్ కుమార్ భార్య పేరిట కెటాయించిన డబుల్ ఇంటిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. బీఎన్ఎస్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్డీఓ స్పష్టం చేయడంతో పాటు వారం రోజుల్లో ఇంటిని ఖాళీ చేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు. అలాగే ఈ ఇంటిని అతని తండ్రి రాజమల్లుకు కెటాయించాలని కూడా నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యూనల్ ఆదేశాలపై జిల్లా కలెక్టర్ కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉండడం కష్టమేనని తెలుస్తొంది. డబుల్ ఇళ్లు రాజమల్లుకు అలాట్ అయిన తరువాత వారసులను తనతో పాటు ఉండేందుకు అనుమతించే విషయంలో కూడా ఆయన నిర్ణయానికే వదిలేస్తున్నట్టుగా ట్రిబ్యూనల్ స్పష్టం చేసింది. అలాగే ఇద్దరు కోడుకులు తండ్రి రాజమల్లు ఖర్చుల కోసం నెలకు రూ. 2 వేల చొప్పున చెల్లించాలని కూడా స్పష్టం చేశారు. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను విస్మరిస్తే చట్టాలను పకడ్భందీగా అమలు చేస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, వారసులు మెదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

You cannot copy content of this page