‘ఠాణా దివస్’…

రాజన్న జిల్లా ఎస్పీ వినూత్న ప్రయోగం

దిశ దశ, రాజన్న సిరిసిల్ల జిల్లా:

ప్రజల వద్దకు పాలనను మరిపించబోతున్నారా ఎస్పీ… మీ సమస్యల పరిష్కారం కోసం నా చెంతకు రాకండి… నేనే మీ వద్దకు వస్తా అప్పుడు వ్యక్తిగతంగా కలవండి… మీ సమస్యలు వివరించండి అంటున్నాడా ఏస్పీ. రాష్ట్రంలోనే సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తన మార్కు సేవలందించేందుకు సమాయత్తం అయ్యారు. మంచిర్యాల నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన ఆయన కొంతకాలం జిల్లా పరిస్థితులను అవగాహన కల్పించుకుని తనదైన స్టైల్లో ప్రజలకు సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా అఖిల్ మహాజన్ మంగళవారం నుండి ‘ఠాణా దివస్’ పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.

వేములవాడ వేదికగా…

దక్షిణ కాశీగా భాసిల్లుతున్న రాజన్న క్షేత్రం వెలిసిన వేములవాడ కేంద్రంగా ఈ సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లోనే ఎస్పీ అందుబాటులో ఉండనున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ప్రజలు నేరుగా ఎస్పీని కలిసి తమ సమస్యలు చెప్పినట్టయితే చట్టపరిధిలో అయ్యే వాటిని పరిష్కరించేందుకు నడుం బిగించబోతున్నారు రాజన్న జిల్లా ఎస్పీ. తమ గోడు వెల్లబోసుకునేందుకు సామన్య జనం జిల్లా కేంద్రానికి రావడం తన కార్యాలయంలో కలవడం వల్ల వారికి ఆర్థిక ఇబ్బంది ఉండడంతో పాటు అన్ని గ్రామాల ప్రజలు నేరుగా ఎస్పీని కలిసే అవకాశం ఉండదు. దీంతో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉన్నట్టయితే సేవలను క్షేత్ర స్థాయి వరకు విస్తరింపజేయవచ్చన్న ఆలోచనతో అఖిల్ మహాజన్ ఈ వినూత్న కార్యక్రమానికి పూనుకున్నారు. సాయంత్రం వరకు స్టేషన్ కు వచ్చి బాధితులు ఎవరైనా కలిసి వినతులు అందించవచ్చని ఎస్పీ ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలతో మమేకమైనప్పుడే అన్ని రకాల సమస్యలను గుర్తించే అవకాశం ఉంటుందని గమనించే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా రాష్ట్రంలోనే కాస్తా డిఫరెంట్ గా ఆలోచించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రతి నెల మొదటి మంగళవారం ‘ఠాణా దివస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం.

రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

You cannot copy content of this page