దిశ దశ, సిద్దిపేట:
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌజ్ లో రాజశ్యామలా సహిత సుబ్రమణ్యేశ్వర యాగం బుధవారం ప్రారంభం అయింది. విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామి యాగ సంకల్పం చేయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సతీమణిలచే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దక్షినాది రాష్ట్రాలకు చెందిన రుత్వికులు మూడు రోజుల పాటు ఈ యాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. గోపూజ అనంతరం సీఎం కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగం ప్రారంభించారు. అస్తరాజార్చన, కర్కరీయ స్థాపన కార్యక్రమం, అఖండ స్థాపన అనంతరం అగ్ని మధనం చేసి యాగశాలలో అగ్ని దేవుడిని ప్రతిష్టించారు. ఈ యాగంలో ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, మాజీ మంత్రి వేణుగోపాల చారి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.