రామడుగు రంగ‘స్థలం’

అటు చరిత ఇటు భవిత…

కళను కాపాడుతున్న కట్టా కుటుంబం

దిశ దశ, రామడుగు:

సాంకేతికతకు దగ్గరై… వ్యక్తిగత సంబంధాలకు దూరమై జీవనం సాగిస్తున్న ఈ కాలంలోనూ అక్కడ అనాదిగా వస్తున్న ఆచారాన్ని తూ చ తప్పకుండా పాటిస్తున్నారు. ఓ కుటుంబంలో ఏడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం వివిధ ప్రాంతాలకు విస్తరించడంతో పాటు నేటికీ రంగ స్థల కళను పెంచిపోషిస్తున్న తీరుకు హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఏక ధాటిగా 10 గంటల పాటు సాగే ఈ కళా ప్రదర్శనను వందలాది మంది ఆ వేదిక వద్దకు చేరుకుని కనులారా ప్రదర్శనను తిలకిస్తున్న తీరు ఆదర్శప్రాయం. శిల్ప కళా నైపుణ్యానికి మారుపేరైన రామడుగు సిగలో దాగి ఉన్న మరో నగ రంగస్థల నాటకంపై ఓ లుక్కెద్దాం.

నాటకానికి ఆద్యుడు లక్ష్మీ నరసయ్య భాగవతార్

రామడుగు వేదికగా…

సరిగ్గా 70 ఏళ్ల క్రితం కట్టా లక్ష్మీ నరసయ్య భాగవతార్ ఇంట రంగ స్థలం ప్రారంభం అయింది. శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రను నాటక రూపంలో లక్ష్మీ నరసయ్య తన స్నేహితులతో కలిసి ప్రదర్శించడం స్టార్ట్ చేశారు. మొదట ఇంటి వద్ద ప్రారంభం అయిన ఈ నాటక ప్రదర్శనను ప్రజలు ఆదరించడంతో హై స్కూల్ గ్రౌండ్ కు వేదికను మార్చారు. కట్టా లక్ష్మీ నరసయ్య భాగవతార్ నుండి మొదలైన నాటక ప్రదర్శనను ఆయన వారుసులు నేటికీ ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఏటా చైత్ర శుద్ద పంచమి రోజున ఆయన వారసులు నాటక ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. ఈ కుటుంబానికి చెందిన ఐదో తరం వారు నేటికీ రామడుగులో నాటక ప్రదర్శన చేస్తూనే ఉన్నారు. లక్ష్మీ నరసయ్య పెద్ద కొడుకు నిరంజనా చారీ, సత్యానారాయణలు చనిపో్యిగా వీరి సోదరుడు నరసింహాచారీ కళాకారుల సహకారంతో సాంప్రాదాయాన్ని కంటిన్యూ చేస్తున్నారు.

సాఫ్ట్ వేరు టు చైల్డ్ ఆర్టిస్ట్…

వీరబ్రహ్మేంద్ర స్వామి నాటక ప్రదర్శనలో భాగస్వామ్యం అవుతున్న వారి గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే. సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా స్థిరపడ్డ వారు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారు వివిధ పాత్రలను పోషిస్తున్నారు. ఆధునిక పోకడలతో ముందుకు సాగుతున్న నేటి తరంలో రంగస్థల నాటకాలకు ఆదరణ తగ్గిపోయిందన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్న వారు కూడా తమలోని కళలను ప్రదర్శిస్తుండడం విశేషం. పసి పిల్లల నుండి ఆరుపదుల వయసు దాటిన వారు కూడా తమ కళా ప్రదర్శన చేస్తూ రామడుగు రంగస్థలం వేదికగా అటు చరితను నేటి తరానికి అందిస్తూ నాటకరంగ భవితను భావితరాలకు అందిస్తుండడం ఆదర్శనీయమనే చెప్పాలి.

అచ్చమ్మ పాత్రలో ప్రవీణ్

నెల రోజుల ప్రాక్టీస్…

చైత్ర శుద్ద పంచమి రోజున ఏక ధాటిగా 10 గంటల పాటు జరిగే ఈ నాటక ప్రదర్శ న కోసం కళాకారులు నెల రోజులకు ముందు నుండే రిహార్సల్స్ చేస్తుంటారు. అయితే ఉపాధి కోసం ఉద్యోగాల్లో స్థిరపడిన వారు వాట్సప్ ద్వారా స్క్పిప్టులు షేర్ చేసుకుంటూ తీరిక సమయాల్లో ప్రదర్శన కోసం సమాయాత్తం అవుతుంటారు. ఒక రోజు ముందు రామడుగు చేరుకుని ఫైనల్ రిహార్సల్స్ చేసి కార్యరంగలోకి దిగుతారు.

రిహార్సల్స్ చేస్తున్న కళాకారులు

జాగాహారమే…

చైత్య శుద్ద పంచమి రోజు రాత్రి 8 గంటల నుండి మరునాడు ఉదయం 6 గంటల వరకు నిరాంటంకగా సాగే ఈ నాటక ప్రదర్శనను తిలకించేందుకు ప్రేక్షకులు జాగాహారం చేస్తారు. రామడుగుతో పాటు సమీప గ్రామాలకు చెందిన వారు పట్టణ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ రంగస్థల నాటకాన్ని వీక్షించేందుకు ఇక్కడకు చేరుకుంటారంటే ఎంతటి ప్రత్యేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.

You cannot copy content of this page