కమలానికి చిక్కని చెన్నమనేని..?

బీజేపీలో చేరే ప్రసక్తే లేదని వెల్లడి…

దిశ దశ, కరీంనగర్:

కమల నాథుల ప్రయత్నాలు బెడిసి కొట్టినట్టుగా ఉంది. వేములవాడలో చెన్నమనేని రమేష్ బాబును రంగంలోకి దింపి జాక్ పాట్ కొట్టాలని చేసిన ప్రయత్నం విఫలం అయినట్టుగా తెలుస్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాల్సి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆయన పౌరసత్వ వివాదంపై తుది తీర్పు వెలువడే అవకాశం ఉన్నందున టికెట్ ఇవ్వడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాకరించారు. పౌరసత్వ అంశమే తమకు ప్రధాన కారణమని సీఎం మీడియా ముందు కూడా వెల్లడించారు. అయితే ఇదే అదునుగా భావించిన బీజేపీ నాయకులు రంగంలోకి దిగి చెన్నమనేని రమేష్ బాబును కాషాయం కండువా కప్పుకోవాలని కోరారు. జర్మనిలో ఉన్న ఆయనకు ప్రత్యేకంగా ఫోన్ చేసిన రాష్ట్ర బీజేపీ నేతలు బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే రమేష్ బాబు మాత్రం ఇందుకు సమ్మతించనట్టుగా తెలుస్తోంది. మొదట రమేష్ బాబు బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సానుకూలత వ్యక్తం చేశారన్న ప్రచారం జరిగినప్పటికీ అదంతా వట్టిదేనని తేలింది. ఎమ్మెల్యే రమేష్ బాబు కూడా తాను పార్టీ మారే ఆలోచనలో లేనని, బీజేపీలోకి అసలే వెళ్లనని తన అత్యంత సన్నిహితులతో చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో బీజేపీ నాయకుల ప్రయత్నం ఫెయిల్ అయినట్టేనని స్పష్టం అవుతోంది. వాస్తవంగా చెన్నమనేని రమేష్ బాబు బీజేపీలోకి వచ్చినట్టతే తన బాబాయ్ ఫ్యామిలీతో పోటీ పడాల్సిన అవశ్యకత ఉంది. కమలం పార్టీలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు, ప్రధాని మోడీ, హో మంత్రి అమిత్ షాతో పాటు ముఖ్య నాయకులతో నేరుగా సంబంధాలు ఉన్న పూర్వ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావు వేములవాడ నుండి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో రమేష్ బాబు బీజేపీలో చేరినట్టయితే ఒకే కుటుంబం నుండి పోటీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు తండ్రి చెన్నమనేని రాజేశ్వర్ రావు సిద్దాంతాలకు తిలోదకాలు ఇచ్చినట్టే అవుతుందని కూడా రమేష్ బాబు భావించే అవకాశాలూ లేకపోలేదు. అయితే బీజేపీ మాత్రం ఇంకా తన ప్రయత్నాలను మాత్రం వీడడం లేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. బుధవారం జర్మనీ నుండి వేములవాడకు రానున్న రమేష్ బాబుతో మరోసారి చర్చలు జరిపేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు.

శంఖంలో పోస్తే సరా..?

‘ఏ నీరు అయితేనేమీ శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది’ అన్న నానుడి బీజేపీ తీరుకు సరిగ్గా సరిపోయినట్టుగా ఉంది. వేములవాడ ఎమ్మెల్యే విషయంలో ఓ వైపున జర్మని పౌరసత్వ వివాదం కోర్టులో నడుస్తున్న సంగతి తెలిసిందే. రమేష్ బాబు పౌరసత్వంపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోం శాఖను కోర్టు ఆదేశించడంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నివేదికను కోర్టు ముందు ఉంచింది. ఈ అంశంపై నేడో రేపో తుది తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు చెన్నమనేని రమేష్ బాబును బీజేపీలోకి ఆహ్వానించడం వెనక ఆంతర్యం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ఒక వేళ ఆయన బీజేపీలో చేరితే పౌరసత్వ వివాదం సద్దుమణిగిపోతుందా..? ఆయన భారతీయ పౌరుడేనని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ పార్టీ చెప్పకనే చెప్పినట్టు అవుతుంది కదా..? దీంతో ఇక అంశం మరుగున పడిపోవడం ఖాయమేనా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు పౌరసత్వ వివాదం విషయంలో బీజేపీ డైరక్ట్ గా అటాక్ చేయకున్నప్పటికీ సానుకూలంగా మాత్రం వ్యవహరించలేదు. అయితే గతంలో ఓ సారి బీజేపీ నుండి వేములవాడ అభ్యర్థిగా పోటీ చేసిన ఆది శ్రీనివాస్ కూడా రమేష్ బాబు పౌరసత్వ వివాదంపై బీజేపీ సానుకూలత ప్రదర్శిస్తుందని ఆశించారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం, బీజేపీ జాతీయ నాయకులు కూడా ఆయనకు మద్దతుగా రాకపోవడంతో బీజేపీని వీడి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లేనట్టయితే వేములవాడలో బలమైన అభ్యర్థి బీజేపీ చేతిలో ఇప్పటికే ఉండే వారు. ఇలాంటి పరిస్థితుల్లో రమేష్ బాబును బీజేపీలోకి తీసుకున్నట్టయితే ప్రజల్లో ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందో అర్థం చేసుకోవచ్చు. వేములవాడ ఎమ్మెల్యేను బీజేపీలోకి చేర్పించుకున్నట్టయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓట్లు అడిగేందుకు ప్రజల్లోకి వెల్లడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మరి కొన్ని గంటల్లో ఇండియాలోకి అడుగు పెట్టనున్న రమేష్ బాబుతో బీజేపీ నాయకులు ఎలాంటి చర్చలు జరుపుతారు..? ఆయన పార్టీలో చేరే విషయంలో ఫైనల్ డెసిషన్ ఏమని తీసుకుంటారు అన్న విషయం తేలాలంటే వేచి చూడాల్సిందే.

You cannot copy content of this page