దిశ దశ, వేములవాడ:
రాజీవ్ గాంధీ కారణంగానే రాముని చరిత్ర వెలుగులోకి వచ్చిందని, ఆనాడు ఆయనే రాముడి చరిత్రను వెలికి తీశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ… ఆలయం పూర్తి కాకుండా ప్రాణ ప్రతిష్ట చేయడం సరికాదని వ్యాఖ్యానించిన ఆయన జగద్గురువులు కూడా ఈ విషయం చెప్తున్నారన్నారు. దేవుడిని కూడా ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారని… హిందూ సంస్కృతి ఉన్న వారు దేవుడిని గౌరవిస్తారని, ఆయన కొందరికే సొంతం అన్నట్టుగా వ్యవహరిస్తున్నామని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆరు శాస్త్రాలు, 18 పురణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతిర్లింగాలు, నాలుగు వేదాలు, నలుగురు జగద్గురువులు ఉన్నారన్నారు. జగద్గురువుల చేతుల మీదుగా ప్రారంభించాల్సిన రామాలయన్ని ఎన్నికల కోసం రాజకీయాల కోసం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. పవిత్ర భారత దేశంలో రాజకీయాలను కూడా మార్కెటింగ్ చేస్తున్నారని, ఈ తప్పిదాలను ఎత్తి చూపుతూ తాము ప్రశ్నిస్తే హిందువులకు వ్యతిరేకమంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. హిందుత్వాన్ని విశ్వసించే వారంతా కూడా దేశంలో జరుగుతున్న పరిణామాలను గమనించి ఆలోచించాలని పొన్నం ప్రభాకర్ అభ్యర్థించారు. రాముడు, శివుడు, హన్మంతుడు మాకు లేడా అని మేమంటే మాపై రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిష్ట దిగజారుతున్నా దేవుడి ముసుగులో రాజకీయాలు చేస్తున్నారని, పార్లమెంటులో అదాని అంబాని గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు.
శివరాత్రి కంటే ముందే…
వేములాడ అభివృద్ది విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శివరాత్రి పర్వదినానికి ముందే ఆలయ అభివృద్ది గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. వీటీడీఏ సమావేశం ఏర్పాటు చేసి ఆలయ అభివృద్దికి సంబంధించిన విషయాలపై చర్చిస్తామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.