పుష్కరాలకు ముస్తాబవుతున్న కాళేశ్వరం
దిశ దశ, కాళేశ్వరం:
ప్రపంచంలోనే అత్యంత అరుదైన క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న కాళేశ్వరం ఎంతో చారిత్రాత్మక నేపథ్యాన్ని సంతరించుకుంది. త్రిలింగ క్షేత్రం, త్రివేణి సంగమంగా మాత్రమే వెలుగులోకి వచ్చిన ఈ ఆలయ ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు ప్రయాగరాజ్ తరువాత సరస్వతి నది పుష్కరాలు నిర్వహించే ఏకైక క్షేత్రం కాళేశ్వరం మాత్రమే కావడం దక్షిణాది రాష్ట్రాలకు వన్నె తెచ్చినట్టయింది. మే నెలలో అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం ముస్తాబు అవుతోంది.
అరుదైన చరిత…
నేపాల్ లోని పశుపాతనాథ స్వామి, కాశీ విశ్వేశ్వర ఆలయాల కాళేశ్వరానికి మాత్రమే ప్రత్యేకత ఉంది. సాధారణంగా తూర్పు దిక్కు నుండి మాత్రమే ఆలయాల్లో సందర్శన చేసేందుకు వీలుంటుంది. చాలా వరకు ఆలయాల్లో తూర్పు ద్వారం గుండానే భక్తులకు మూల విరాట్టును దర్శించుకునే అవకాశం ఉంటుంది. అయితే నేపాల్ లోని పశు పాథ నాథ స్వామి, కాశీలోని విశ్వేశ్వర స్వామి ఆలయాలతో పాటు కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి ఆలయంలో మాత్రమే నాలుగు వైపుల నుండి గర్భాలయంలోని స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే కాలేశ్వరం గర్భాలయానికి నాలుగు వైపులా ద్వారాలు నిర్మించారు. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తర దిక్కుల నుండి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం ఉండడంతో భక్తులకు కూడా సౌకర్యంగా మారిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఏపీలోని ద్రాక్షారామంతో పాటు మరికొన్ని ఆలయాల్లో మాత్రమే గర్భాలయం చుట్టూ ప్రాకారం ద్వారా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాళేశ్వరం ఆలయంలో కూడా ప్రాకారం మంటపం ఉండడం కూడా మరో విశేషం.
రాహు కేతువుల పూజలు…
కాళేశ్వరం ఆలయం రాహుకేతువుల పూజలకు కూడా ప్రసిద్ది. సుబ్రమణ్య స్వామి వెలిసిన క్షేత్రాలు, ఏపీలోని కాళహాస్తి ఆలయాల్లో మాత్రమే రాహు కేతువుల పూజలు జరుపుకునే అవకాశం ఉంటుంది. ఆ ఆలయాల సరసన కాళేశ్వరం క్షేత్రం కూడా చేరింది. వైవాహిక పరంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు రాహు కేతుల పూజలు జరిపితే దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. కాలసర్ప దోష నివారణ కోసం ఈ పూజలు నిర్వహిస్తుంటారు. కాళేశ్వరంలోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో రాహు కేతువుల పూజలు నిర్వహించి నవ గ్రహారాధాన చేయడం వల్ల సానుకూల ఫలితాలు దక్కుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ప్రతి మంగళవారం కాళేశ్వరంలో రాహుకేతువుల పూజలు నిర్వహించుకునేందుకు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారని ఆలయ ప్రధాన అర్చకుడు పనకంటి నగేష్ శర్మ తెలిపారు.
ఏర్పాట్లు…
వచ్చే నెలలో జరగనున్న సరస్వతి నది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్న ప్రభుత్వం ఏర్పాట్లు చేయించేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటోంది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఇప్పటికే పలుమార్లు కాళేశ్వరంలో సరస్వతి నది ఏర్పాట్ల సందర్భంగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సర్వసతి నది పుష్కరాలు నిర్వహించే వీఐపీ ఘాట్ వద్ద ప్రత్యేకంగా నిర్మాణాలు చేయిస్తున్నారు. అలాగే ఆలయం ప్రాంగణంలో రోడ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పుష్కర సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు.