ఆ సీఐకి అరుదైన గౌరవం… ఆయన బదిలీతో కన్నీటి పర్యంతం…

దిశ దశ, నాగర్ కర్నూల్:

లా అండ్ అర్డర్ సీఐ అంటే అత్యంత గౌరవం ఇచ్చే ఈ సమాజంలో ఆ విభాగానికి అంతగా ప్రయార్టీ ఇవ్వరు. యూనిఫాం డిపార్ట్ మెంటే అయినా ఆ విభాగంతో సంబంధాలు కూడా చాలా తక్కువ వర్గాలకు ఉంటాయి. ఆ విభాగానికి చెందిన వారు బదిలీ అయితే ఆ శాఖతో సంబంధాలు ఉన్న వారు మాత్రమే సత్కారాలు… సన్మానాలు చేస్తుంటారు. కానీ ఈ విభాగంలో పనిచేస్తున్న ఓ ఇన్స్ పెక్టర్ అత్యంత అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఆయన బదిలీ గురించి విన్న యువత కన్నీరు మున్నీరుగా విలపించింది. సమాజంలో అంతమాత్రమే ప్రాధాన్యత ఉండే ఆ శాఖ ఇన్స్ పెక్టర్ కు ఉన్న స్పెషాలిటీ ఏంటీ..? యూత్ లో అంత క్రేజీ సంపాదించుకోవడానికి కారణమేంటీ..?

నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సీఐ ఏడు కొండలు వైవిద్యమైన జీవనాన్ని సాగిస్తున్నారు. అటు విధి నిర్వహణతో పాటు ఇటు యువతకు దిశా నిర్దేశం అందించే బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. తిరుమలలో వెంకటేశ్వరుడు వెలిసిన ఏడు కొండలు అని పేరు పెట్టిన ఆ తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తున్న ఆయన లక్షలాది మంది నిరుద్యోగ యువతకు స్పూర్తి ప్రధాతగా నిలిచారు. కలియుగ దైవం కొలువైన శ్రీనివాసుడితో పాటు ఆయన దర్శనానికి వచ్చే భక్తులను సప్తగిరులు అక్కున చేర్చుకున్న విధంగానే ఏడు కొండల అని పేరు పెట్టుకున్న ఈ ఎక్సైజ్ సీఐ నిరుద్యోగుల పాలిట ప్రత్యక్ష్య దైవంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ అధికారిగా దర్జాతనం చూపిస్తూ… తన పరిధిలో తాను తన కుటుంబం బావుంటే చాలనుకుంటూ జీవనం సాగించడంతో ఫలితం లేదునుకున్నారు. ఉద్యోగాన్వేషణలో తాను ఎదుర్కొన్న కష్ట నష్టాలు నేటితరం పడకూడదన్న ఆలోచనతో ముందుకు సాగారు. అక్రమ మద్యం అమ్మకాలు, నాటు సారా తయారీ, గంజాయి సాగు, అక్రమ రవాణా వంటి మత్తు పదార్థాల కట్టడి వంటి విధుల్లో తలమునకలు అయితే చాలానుకోకుండా యువతకు నిర్దిష్టమైన మార్గాన్ని చూపిస్తే అక్రమ దందాలు కూడా కొంతలో కొంతైనా తగ్గుతాయని భావించారు. ఉద్యోగాలు అందుకోలేకపోయిన నిరుద్యోగులు నిరాశ నిసృహులతో కొట్టుమిట్టాడి వక్రమార్గం పట్టడం సరికాదని, వారిని సన్మార్గంలో నడిపిస్తే అన్నింటా మంచిదని భావించారు. అందులో భాగంగానే స్పెషల్ ‘మిషన్’ ప్రారంభించారు ఎక్సైజ్ సీఐ ఏడు కొండలు.

‘ది మిషన్’ పేరిట సంస్థను ఏర్పాటు చేసిన ఏడు కొండలు నిరుద్యోగ యువతకు స్పూర్తి ప్రధాతగా నిలిచారు. పేద కుటుంబాలకు చెందిన యువత ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన విధంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన ఆరున్నరేళ్లుగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఫిజికల్ క్లాసులు తీసుకునేవారు. ఆయన ఏర్పాటు చేసిన ఈ క్లాసులకు హాజరయ్యేందుకు వందల సంఖ్యలో నిరుద్యోగులు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బస చేస్తున్నారంటే ఎక్సైజ్ సీఊ ఏడుకొండలు ఏ స్థాయిలో సేవలందించారో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఫిజికల్ క్లాసులే కాకుండా 42 కేంద్రాలలో ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది యువత ఏడు కొండలు సార్ చెప్పే పాఠాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపేవారు. అంతటి క్రేజీ సంపాదించుకున్న ఆయన విధి నిర్వహణతో పాటు నిరుద్యోగులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించుకుని ది మిషన్ పేరిట స్పెషల్ క్లాసులు తీసుకునేవారు. గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యే వారితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు ఆయన శిక్షణలో తర్ఫీదు పొందుతున్నారు. ఏడు కొండలు వద్ద కోచింగ్ తీసుకున్న వారిలో చాలా మంది కూడా వివిధ స్థాయి ఉద్యోగాలు అందుకుని పలు శాఖల్లో సేవలందిస్తున్నారు. అయితే ఆయన బదిలీ కావడంతో నాగర్ కర్నూల్ లో నిరుద్యోగ యువత కన్నీటి పర్యంతం అయింది. విజనరీతో కూడిన మిషన్ నిర్వహిస్తున్న తమ పెద్దన్న బదిలీపై వెలుతున్నాడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువత తల్లడిల్లిపోయిన తీరు అందరినీ ఆశ్యర్యపర్చింది. ఆయనకు ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేసి భారీ ర్యాలీ నిర్వహించిన ఉద్యోగార్థులు ఓపెన్ టాప్ వెహికిల్ లో సభా వేదికవద్దకు తీసుకెళ్లారు. అయితే తాను బదిలీపై మాత్రమే వెల్తున్నాను కానీ తన లక్ష్యాన్ని మాత్రం యథావిధిగా కొనసాగిస్తానని ఎక్సైజ్ సీఐ ఏడు కొండలు స్పష్టం చేశారు. ఆన్ లైన్ క్లాసుల ద్వారా ఉద్యోగాలు అందించడానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తానన్నారు. తెలంగాణ ఎక్సైజ్ విబాగంలోనే ఆణిముత్యంగా భాసిల్లుతున్న ఏడు కొండలు ఆశయం సప్తగిరులంత ఎత్తున ఉండడం నిజంగా ఆదర్శప్రాయమే.

You cannot copy content of this page