వెయ్యి కోట్ల విల్లాలో రష్యా అధ్యక్షుడి రాసలీలలు?

పుతిన్‌ ప్రియురాలుగా భావిస్తున్న మాాజీ జిమ్మాస్ట్ అలీనా కబయేవా గురించి మరో కథనం బయటకు వచ్చింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన దగ్గరి నుంచి పుతిన్ ప్రియురాలు తరుచూ వార్తాల్లో నానుతున్నారు. జిమ్నాస్టిక్స్ వదిలి పెట్టిన తర్వాత అలీనా రష్యా రాజకీయాల్లోకి పుతిన్ అండతోనే ప్రవేశించారు. మూడేళ్ల వయసులోనే రిథమిక్ జిమ్నాస్టిక్స్‌ సాధన ప్రారంభించిన కబయేవా.. 15 ఏళ్ల వయసుకే ఐరోపా ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని అత్యంత చిన్నవయసులో ఆ ఘనత సాధించిన తొలి రష్యన్‌గా నిలిచారు.
ఉక్రెయిన్‌ పై గతేడాది ఫిబ్రవరిలో దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ గురించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఆయన తన ప్రియురాలు అలీనా కబయేవాతో రహస్యంగా ఖరీదైన ఎస్టేట్‌లో గడుపుతున్నట్టు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. రష్యా రాజధాని మాస్కోకు 400 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ ఎస్టేట్ విలువ 120 మిలియన్ల డాలర్ల (దాదాపు రూ. 990 కోట్లు) ఉంటుందని ఇండిపెండెంట్ కథనం వెల్లడించింది. ఈ ఎస్టేట్‌లో అనేక భవనాలు ఉన్నాయని, కబయేవా పిల్లల కోసం ఓ ప్లేగ్రౌండ్‌ కూడా ఉందని తెలిపింది. పుతిన్ నిషేధించిన రష్యా ప్రతిపక్షానికి చెందిన పరిశోధనాత్మక వార్తా వెబ్‌సైట్‌ ది ప్రాజెక్ట్‌ వర్గాలు ఈ విషయాన్ని బయటపెట్టినట్టు ది టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. జిమ్నాస్ట్‌, ఒలంపిక్స్‌ గోల్డ్ మెడలిస్ట్‌ అయిన అలీనా కబయేవాతో పుతిన్‌ చాలాకాలం నుంచి ప్రేమాయణం సాగిస్తున్నారని, వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారని పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. వాల్దాయ్‌ సరస్సుకు సమీపంలో ఉండే ఈ విల్లాను సైప్రస్‌ నుంచి వచ్చిన అక్రమ నిధులను ఉపయోగించి కొనుగోలు చేసినట్టు మీడియా కథనం తెలిపింది. 13 వేల చదరపు అడుగుల వైశాల్యంలో దీనిని నిర్మించారని, ఈ భవనంలో బంగారాన్ని కూడా ఉపయోగించినట్లు బయటకొచ్చిన కొన్ని ఫోటోలను బట్టి తెలుస్తోంది. విల్లా నిర్మాణం 2020లో ప్రారంభించి.. 2021లో పూర్తిచేశారని చెప్పింది. ఈ ప్యాలెస్ రష్యన్ డాచా శైలిలో పూర్తిగా చెక్కతో నిర్మించారట.
అక్రమ నిధుల నుంచి అలీనాతో పాటు ఆమె బంధువులు కూడా లబ్ధి పొందుతున్నారని కథనం పేర్కొంది. అలీనా నాయినమ్మ అన్నా జాట్సెపిలినా కూడా 10 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.100 కోట్లు) సొంత ఆస్తులు ఉన్నాయని, మాస్కోకు సమీపంలో మూడు అంతస్తుల విలాసవంతమైన భవనం ఉందని వివరించింది. మొదట ఈ ఎస్టేట్ గురించి బయటపెట్టిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీ బృందం.. బడ్జెట్ నిధులను దీనికి వెచ్చించారని ఆరోపించింది.
పుతిన్‌ అండతో రాజకీయాల్లో అడుగుపెట్టిన అలీనా.. యునైటెడ్‌ రష్యా పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. ఆరేళ్ల పాటు పార్లమెంట్ సభ్యురాలిగానూ వ్యవహరించారు. నేషనల్‌ మీడియా గ్రూప్‌ డైరెక్టర్ల బోర్డు ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఈ కంపెనీకి రష్యాలోని అన్ని ప్రధాన మీడియా సంస్థల్లో మెజార్టీ వాటాలున్నాయి. అయితే, కబయేవాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయాన్ని పుతిన్ బహిరంగంగా ఎప్పుడూ అంగీకరించలేదు. కబయేవా, పుతిన్ 2008 నుంచి సహజీవనం చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఆమెను మకుటం లేని రష్యా మహారాణిగా చెప్పుకుంటారు.

You cannot copy content of this page