దిశ దశ, కరీంనగర్:
సివిల్ సప్లై గోదాం నుండి రేషన్ డీలర్ వద్దకు చేరుకుని ఫుడ్ సెక్యూరిటీ కార్డు దారులకు చేరాల్సిన పీడీఎస్ బియ్యం నేరుగా ఓ రైస్ మిల్లుకు చేరాయి. ఈ సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీసులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ శ్రీ వెంకటేశ్వర మినీ రైస్ మిల్లులో స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సోమవారం అర్థరాత్రి చేపట్టిన ఈ తనీఖీల్లో భారీ స్కాం జరుగుతున్న విషయాన్ని గుర్తించారు. సుమారు 200 బ్యాగుల బియ్యాన్ని మిల్లులో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మిల్లు ఆవరణలోనే టీఎస్ 02యూడి, 8820 వాహనంలో కూడాపీడీఎస్ రైస్ బియ్యం సంచులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పీడీఎస్ బియ్యం పౌరసరఫరాల గోదాం నుండి నేరుగా రైస్ మిల్లుకే చేరినట్టుగా అనుమానిస్తున్నారు. గన్నీ బ్యాగులు కూడా సివిల్ సప్లై విభాగం సరఫరా చేసినవిగా పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. అయితే ఈ బియ్యం ఏ రేషన్ షాపుకు వెల్లాల్సి ఉందో కూడా తెలుసుకోవల్సిన అవసరం కూడా ఉంది. ప్రధానంగా సివిల్ సప్లై అధికారులు ఇచ్చే వే బిల్లుల ఆధారంగా లారీల్లో తరలించే ధాన్యం సంబందిత షాపుకే చేరవేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నా రవాణా కాంట్రాక్టర్లు బాధ్యతలు వహించాల్సి ఉంటుంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని పోలీసులు విచారణ చేసి బాద్యులైన వారిపై చర్యలు తీసుకున్నట్టయితే రేషన్ బియ్యం అక్రమ రవాణాకు బ్రేకులు వేసే అవకాశాలు ఉన్నాయి. రేషన్ బియ్యం తరలించే లారీలకు జీపీఎస్ సిస్టం అమల్లో ఉన్నా కూడా దారి మల్లించడం వెనక అసలేం జరుగుతోందో కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉంది.
సీఎమ్మార్..?
అయితే సదరు రైస్ మిల్లుకు చేరిన రేషన్ బియ్యం వ్యవహారంపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లోటును పూడ్చుకునేందుకు తరలించుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. జిల్లాలోని చాలా రైస్ మిల్లులు సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్ సీఐకి తిరిగి అప్పగించనట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు సీజన్ కు సంబంధించిన బియ్యాన్ని చెల్లించాల్సిందేనని సివిల్ సప్లై అధికారులు ఒత్తిడి పెంచడంతో రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి సీఎంఆర్ లోటును భర్తీ చేసే పనిలో మిల్లర్లు నిమగ్నం అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎఫ్ సీ ఐకి సరఫరా చేసేందుకు సీఎంఆర్ కింద ధాన్యాన్ని సేకరించిన మిల్లర్లు బియ్యాన్ని మాత్రం అప్పగించగనట్టుగా సమాచారం. సీఎంఆర్ భర్తీ చేయాలని ప్రభుత్వ అధికారులు ఒత్తిళ్లకు గురి చేస్తుండడంతో మిల్లర్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో బియ్యాన్ని సేకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో పెద్దపల్లి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకోగా జిల్లా అధికారులు కేసులు కూడా నమోదు చేశారు. ఇదే విధానం కరీంనగర్ లోనూ వెలుగులోకి రావడంతో సబ్సీడీ బియ్యం ఎలా దారి మల్లుతున్నాయో స్పష్టం అవుతోంది. కరీంనగర్ పోలీసులు ఘటనకు సంబంధించి కేసులు నమోదు చేయనున్నారు.