ఘనంగా మంత్రకూట వేమన జయంతి…నివాళులు అర్పించిన ప్రముఖులు

దిశ దశ, మంథని:

మంత్రకూట వేమన కవిగా భాసిల్లిన ఆయన కలం నుండి జాలువారిన కవితలు సామాజిక సృహతో కూడుకున్నవని పలువురు వక్తలు కొనియాడారు. సోమవారం మంథని పట్టణానికి చెందిన రావికంటి రామయ్య గుప్త 88వ జయంతి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక మునిసిపల్ ఛైర్ పర్సన్ పెండ్రు రమాదేవి మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తన కవితల రూపంలో వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత రామయ్య గుప్తకే దక్కుతుందని అన్నారు. ఉపాధ్యాయునిగా మంథని ప్రాంత బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు సామాజిక ధృక్ఫథంతో కూడిన కవిత్వాన్ని తన కలం నుండి జాలువార్చారన్నారు. 1980వ దశాబ్దంలో గోదావరి ఉగ్ర రూపం దాల్చి మంథని పట్టణ వాసులను అతలాకుతలం చేసినప్పుడు ‘వరద గోదావరి’ పేరిట బతుకమ్మ పాటలు రాసి మంత్రపురి వాసుల కన్నీటి వ్యథను అక్షర రూపంలో సమాజానికి అందించారన్నారు. గలగల పారుతున్న గోదావరమ్మ ఉప్పొంగడంతో మంథని పట్టణంలోని పలు వీధులన్ని వరద నీటిలో ముంపునకు గురయ్యాయని అప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న పట్టణ వాసులు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావని, అప్పటి తరం పడ్డ బాధల గురించి రామయ్య గుప్త రాసిన కవితలను చదివితే కళ్లకు కట్టినట్టుగా అర్థమవుతుందని పెండ్ర రమాదేవి అన్నారు. అటు వృత్తి పరంగా… ఇటు తన కవిత్వంతో మంథని సమజాభివృద్దికి విశేషంగా కృషి చేసిన రామయ్య సార్ గురించి భావితరాలకు తెలియాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి భూషణ్ కాచె, బీఆర్ఎస్ నాయకులు బత్తలు సత్యనారాయణ, సెన్సార్ బోర్డు మెంబర్ బోగోజు శ్రీనివాస్, ఆర్య వైశ్య సంఘం నాయకులు కొమురవెల్లి శ్రీనివాస్, కిషోర్, కొంతం వివేక్; రేపాల రమేష్, ఉపాధ్యాయుడు బిరుదు మధ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంథని విద్యార్థి యువత కార్యాలయంలో కొండెల మారుతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వక్తలు రామయ్య గుప్త వ్యక్తిత్వం, కవితల ప్రత్యేకతల గురించి అభివర్ణించారు. ఈ సమావేశంలో యెలిశెట్టి రాధాకృష్ణయ్య, రేపాల సత్యనారాయణ, మేడగోని రాజమౌళి, రామడుగు మారుతి, కొమురవెల్లి సత్యనారాయాణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామయ్య తనయుడు, సీనియర్ జర్నలిస్ట్ రావికంటి శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సామాజిక రుగ్మతలపై అక్షర ఖడ్గం: విశ్వ మానవ వేదిక

సామాజిక రుగ్మతలపై అక్షర ఖడ్గం దూసిన ఘనత మంత్రకూట వేమన రావికంటి రామయ్య గుప్తకే దక్కుతుందని విశ్వ మానవ వేదిక కొనియాడింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో విశ్వమానవ వేదిక ఆధ్వర్యంలో రావికంటి రామయ్య గుప్త జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. అభ్యుద‌యం, సాంఘిక సంస్క‌ర‌ణ‌, మ‌ద్య‌పానం, నిర‌క్ష‌రాస్య‌త‌.. ఒక్క‌టేమేటి స‌మాజాన్ని ప‌ట్టిపీడించే ప్ర‌తీ సామాజిక రుగ్మ‌తని ప్ర‌శ్నించ‌డంలో వేమ‌న‌, కందుకూరి, గుర‌జాడ‌ల పోరాట వార‌స‌త్వాన్ని రావికంటి రామయ్య గుప్త కొన‌సాగించారని విశ్వమానవవేదిక అధ్యక్షుడు మల్లుల సురేష్ తెలిపారు. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లను పుర‌స్క‌రించుకుని రావికంటి రామ‌య్య గుప్త గారి సాహిత్యాన్ని పుస్త‌కాలు ప్ర‌చురించి గౌర‌వించడం ఆనందించదగ్గ విషయమని తెలిపారు. రావికంటి రామ‌య్య గుప్త లాంటి ప్ర‌జా క‌వుల సాహిత్య సారాంశం ప్రాంతాల‌కు అతీతంగా ప్ర‌జ‌ల‌కు అందించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల మీద ఉందని మల్లుల సురేష్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విశ్వమానవవేదిక సభ్యులు గుంపుల రవి, డాక్టర్ మల్లుల జ్ఞానేశ్వరి, నిల్లా శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page