పరిశ్రమల్లో తనిఖీలు చేయరా… పర్మిట్ల రీ సైక్లింగ్ పై నిఘా కరువా..?

దిశ దశ, కరీంనగర్:

గ్రానైట్ అక్రమ రవాణాతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. ఇప్పటికే బ్లాక్ లిస్టులో చేర్చిన క్వారీల్లో కూడా తవ్వకాలు జరుపుతున్నారని గుర్తించిన మైన్స్ విభాగం మరిన్ని అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అక్రమ వ్యవహారాలకు అడ్డాగా మారిపోయిన గ్రానైట పరిశ్రమపై విజిలెన్స్ నజర్ ఒకటి రెండు అంశాలపైనే ఉంటే సరిపోదని, చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది.

పరిశ్రమల్లో దందా..?

గ్రానైట్ క్వారీలతో పోటీ పడుతున్న పరిశ్రమలు మైన్స్ అండ్ జియోలాజీ అధికారులకు సవాల్ విసురుతున్నాయన్న చర్చ సాగుతోంది. క్వారీల నుండి సేకరిస్తున్న రా మెటిరియల్ విషయంలో ప్రత్యేక నిఘా లేకపోవడంతో ఇష్టారీతిన దందా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో 350 నుండి 400 వరకు గ్రానైట్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇక్కడకు చేరుతున్న గ్రానైట్ బ్లాకుల విషయంలో నిరాటంకంగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్వారీల నుండి తరలిస్తున్నా రా మెటిరియల్ బ్లాకులకు ఇచ్చే పర్మిట్లు రీ సైక్లింగ్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. డ్యామేజీ కింద ఇచ్చే అదనపు గ్రానైట్ కంటే ఎక్కువగానే పరిశ్రమలకు చేరుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కో పర్మిట్ ను ఐదు సార్ల వరకు కూడా రీ సైక్లింగ్ చేస్తూ పెద్ద ఎత్తున రా మెటిరియల్ పరిశ్రమలకు తరలిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గత పదిహేను రోజులుగా బ్లాక్ లిస్టులో ఉన్న గ్రానైట్ క్వారీలతో పాటు, పర్మిట్ల రీ సైక్లింగ్ దందా విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ చాలా పరిశ్రమల్లో రా మెటిరియల్ స్టాక్ పెద్ద ఎత్తున చేరుతోందన్న ప్రచారం సాగుతోంది.

నిఘా లేకేనా..?

ఇటీవల మైన్స్ అండ్ జియోలాజీ అధికారులు బ్లాకు లిస్టులో ఉన్న క్వారీలతో పాటు అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ బ్లాకులపై దృష్టి సారిస్తున్నారు. దీంతో రహదారులపై నిఘా కట్టుదిట్టం చేసినప్పటికీ పరిశ్రమల వైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే రహదారుల విషయంలోనూ నిఘా అంతగా లేదన్న ఆరోపణలు వినిపిస్తుండగా పరిశ్రమల విషయంలో అయితే ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది. ఒక్కో పరిశ్రమలో వంద వరకూ గ్రానైట్ రా మెటిరియల్ బ్లాకులు ఉన్నాయని, సామర్థ్యానికి మించి నిలువలు అక్కడకు వచ్చి చేరుతున్నాయని తెలుస్తోంది. పగటి పూట మాత్రమే నిఘా కొనసాగుతుండగా రాత్రి వేళల్లో కొంత మేర అక్రమ రవాణా సాగుతోందన్న ఆరోఫణలు ఉన్నాయి. మరో వైపున పర్మిట్లపై జారీపై కూడా కట్టదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతో రీ సైక్లింగ్ జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో పరిశ్రమల కేంద్రంగా జరుగుతున్న బ్లాక్ మార్కెట్ దందా వల్ల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తు ఆదాయాన్ని కోల్పోతోందున్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆకస్మిక తనిఖీలు…

గ్రానైట్ పరిశ్రమలతో పాటు రవాణా సాగుతున్న రా మెటిరియల్ బ్లాకులపై ఆకస్మిక తనఖీలు చేపట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ లారీలను అధికారులు పట్టుకున్నప్పటికీ వాటిపై ఫిర్యాదులు వెల్లడం వల్లే దాడులు చేశారని మిగతా సమయాల్లో ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. రవాణా, మైన్స్ విభాగాల అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తే వాస్తవాలు బయటపడతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పరిశ్రమల్లో ఉన్న నిలువలపై కూడా కొరడా ఝులిపించినట్టయితే సర్కారు ఆదాయానికి ఎంతమేర గండిపడిపోతోందోనన్న విషయంపై క్లారిటీ వస్తోందని అంటున్న వారూ లేకపోలేదు.

You cannot copy content of this page