దిశ దశ, దండకారణ్యం:
అణిచివేత ఓ వైపు కొనసాగిస్తూనే చర్చలు జరపుతామన్న ప్రతిపాదనలు చేయడాన్ని బట్టి గమనిస్తే ప్రభుత్వ ద్వంద వైఖరి అర్థమవుతోందని మావోయిస్టు పార్టీ విమర్శించింది. ప్రజల విస్తృత ప్రయోజనాలతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ దిశగా చర్చలకు తాము ఎల్లప్పుడూ సిద్దంగా ఉన్నామని పార్టీ వెల్లడించింది. చత్తీస్ గడ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ చర్చల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో చాలా మంది కూడా మావోయిస్టు పార్టీ స్పందన గురించి అడుగుతున్న నేపథ్యంలో తామీ ప్రకటన విడుదల చేస్తున్నట్టుగా వెల్లడించింది. సూరజ్ కుండ్ తీర్మానాల్లో భాగంగా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారని పార్టీ ఆరోపించింది. జనవరి 1 నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముట్టడి, అణిచివేత తీవ్రంగా చేస్తున్నాయని ఆరోపించారు. మావోయిస్టులను అంతమొందించాలన్న లక్ష్యంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో చర్చల ప్రతిపాదన తీసుకరావడంపై ఆలోచించాలని పేర్కొంది. బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల్లో 10 మంది అమాయకులను ఎన్ కౌంటర్ల పేరిట హతం చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. నారాయణపూర్ జిల్లాలోని అబూజామడ్ ఏరియాలో బీఎస్ఎఫ్, ఐటీబీపీకి చెందిన 6 వేల బలగాలను మోహరించారని, కొత్తగా 40 పారా మిలటరీ క్యాంపులను ఏర్పాటు చేశారన్నారు. మూలవాసి తెగల్లో ఒకటైన మాదియా సమాజానికి చెందిన ఆరు నెలల బాలింతలు ఇద్దరు, మరో ఇద్దరు గ్రామస్థులతో సహా గిరిజనులను హతం చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఓ గిరిజన మహిళ, రైతులపై కాల్పులు జరపగా గాయాల పాలయ్యారని వివరించింది. ప్రకృతి సహజ సంపద, వనరులను కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు బస్తర్ డివిజన్ లోని గిరిజనుల ఊచకోతకు గురిచేయడం తప్ప మరోకటి కాదని పేర్కొంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనకు తాము సిద్దమే కానీ తమ డిమాండ్లకు అనుకూలంగా వ్యవహరిస్తేనే చర్చలకు ముందుకు వస్తామని మావోయిస్టు పార్టీ వెల్లడించింది. పార్టీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట విడుదలైన ఈ ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తో వేచి చూడాలి. చర్చలకు సానూకూల వాతావరణం ఉండేందుకు మావోయిస్టులు పెట్టిన డిమాండ్లు ఇవే. వర్చువల్ లేదా ప్రత్యక్ష్య చర్చలకు తాము ముందుకు రావాలంటే ప్రభుత్వం తమ డిమాండ్లను అమలు చేయాలని పార్టీ కోరుతోంది. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరిట వెలువడిన ఈ ప్రకటనలో పార్టీ ప్రభుత్వం ముందు ఉంచిన అంశాలు ఏంటంటే..? ఎన్ కౌంటర్ ఘటనలకు స్వస్తి పలకడం వంటి చర్యలు మానుకోవాలని కోరింది. పోలీసు బలగాలన్ని కూడా ఆరు నెలల పాటు బ్యారక్ లకే పరిమితం కావడంతో పాటు పారా మిలటరీ బలగాలు కూడా క్యాంపులు, స్టేషన్లలోనే ఉండి పోవాలని, కొత్త క్యాంపులను ఏర్పాటు చేయడం మానుకోవాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని వీటన్నంటికి ప్రభుత్వం సానుకూల వాతావరణం ఏర్పాటు చేసినట్టయితే తాము వర్చువల్ గానా లేక ప్రత్యక్ష్యంగా చర్చలకు హాజరవుతామా అన్న విషయంపై క్లారిటీ ఇస్తామని స్పష్టం చేసింది.
dishadasha
1232 posts
Prev Post
Next Post