శ్రీ ప్రియ రియల్ ఎస్టేట్ భూ స్కాం… నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించిన వారి అరెస్ట్…

దిశ దశ, కరీంనగర్:

మూడు దశాబ్దాల క్రితమే రియల్ భూమ్ కరీంనగర్ కేంద్రంగా సాగింది… అప్పుడు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన వారి భూములను కొల్లగొట్టిన ఘనులు చేస్తున్న అక్రమాల వ్యవహారం ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కరీంనగర్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం… కరీంనగర్ సమీపంలోని వల్లంపహాడ్ శివార్లలో భూములు కొన్న వారితో సంబంధం లేకుండా పట్టాదారులతో మళ్లీ రిజిస్ట్రేషన్లు చేయించారు కొంతమంది అక్రమార్కులు. కరీంనగర్ హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన భూపతి రాజమణి తన కూతురు చెడె రాధికకు వల్లంపహాడ్ శివార్లలోని 145 సర్వే నెంబర్ లోని 200 గజాల స్థలాన్ని గిఫ్ట్ డీడ్ చేశారు. ఈ ప్లాటు వద్దకు వెల్లిన రాధిక తన తల్లిద్వారా సంక్రమించిన భూమే కాకుండా మొత్తం 30 గుంటల స్థలాన్ని కబ్జా చేసిన కొంతమంది కంపౌండ్ వాల్ నిర్మించుకున్నారు. అందులో ఒక గదిని కూడా నిర్మించుకుని ఉన్న విషయాన్ని గమనించిన రాధిక తనకు అన్యాయం జరిగిందని వేదనకు గురయ్యారు. ఆ తరువాత తన భూమిని కబ్జా చేసిన వారి గురించి ఆరా తీయగా మూల ప్రభాకర్ రెడ్డి (66), పెరికరి శ్రీనివాస్ (54), జోముకుంట మల్లయ్య(64)ల ప్రమేయం ఉందని తెలుసుకున్నారు. బాధితురాలు రాధిక కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా రాధిక తల్లి భూపతి రాజమణి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం శ్రీ ప్రియ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా కొనుగోలు చేశానని మొత్తం 15 ఎకరాల 22 గుంటల భూమిని వెంచర్ చేసి విక్రయించినట్టుగా పేర్కొన్నారు. 1993 నుండి 1996 వరకు ఎన్ హెచ్ భాస్కర్ రెడ్డి ఆ ప్లాట్లను డెవలప్ మెంట్ చేసి విక్రయించాడని కూడా తెలిపారు. జీపీఏ ద్వారా భూములను ఎన్ హెచ్ భాస్కర్ రెడ్డి భూములను విక్రయించినప్పటికీ భూ లావాదేవీల్లో ఉన్న తప్పిదాలను గుర్తించిన మూల ప్రభాకర్ రెడ్డి, జోముల మల్లయ్యలు తమ సమీప వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి అక్రమించుకున్నారు. శ్రీ ప్రియ రియల్ ఎస్టేట్ కు సంబంధించిన భూలావాదేవీల గురించి లోతుగా అధ్యయనం చేసిన కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్ కుమార్ డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి మోసం చేశారని గుర్తించారు. శ్రీ ప్రియ సంస్థ ప్లాట్లుగా చేసి విక్రయించిన భూములకు ఏజెంట్లుగా వ్యవహరించిన ప్రభాకర్ రెడ్డి, మల్లయ్యలు హద్దులు చూపించకుండా ఉన్న విషయాన్ని గమనించి అక్రమాలకు తెరలేపినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు నిందితులపై 447, 427, 467, 486, 471, 420, 120 బి , 506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లలో కేసు నమోదు చేశారు. నిందితులు మూల ప్రభాకర్ రెడ్డి, జోముకుంట మల్లయ్య, పెరుకరి శ్రీనివాస్ లను గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు.

You cannot copy content of this page