పోలీసుల విచారణలో పైరవీకారుల ఎంట్రీ… అమాత్యుల పేరు చెప్తున్న ఘనులు

దిశ దశ, కరీంనగర్:

సామాన్యులను జెలగల్లా పట్టిపీడించి దందాలకు తెరలేపిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ జూలు విదిల్చి అక్రమార్కుల కోసం వేట మొదలు పెట్టింది. ఇలాంటి వారిని కట్టడి చేయడంలో కరీంనగర్ కమిషనరేట్ లో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి రావడంతో సామాన్యులు మళ్లీ భయం గుప్పిట చేరిపోతున్నారు. ఇంతకాలం అంగ బలం, అధికార బలం లేకపోవడంతో నిమ్మకుండి పోయిన సామాన్యులు కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి చర్యలతో ఆయనను ఆశ్రయించడం మొదలు పెట్టారు. కానీ కొన్ని కేసుల విచారణలో అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దల పేరిట ఫోన్లు రావడం ఆరంభం అయిందని తెలుస్తోంది. క్యాబినెట్ లోని ముఖ్యమైన బాద్యతల్లో ఉన్న ఓ అమాత్యుని వద్ద పని చేస్తున్నామని, విచారణ దశలోనే క్షేత్ర స్థాయి పోలీసులపై ఒత్తిళ్లకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ లో అడ్డగోలుగా సాగిన భూ దందాలపై కమిషనరేట్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో పైరవీకారులు ఎంట్రీ ఇవ్వడం ఆందోళనకరంగా మారింది.  అమాత్యుని పేరిట  కొంతమంది విచారణకు ఆటంక పరుస్తున్నారని  విశ్వసనీయంగా తెలిసింది. పారదర్శకమైన పరిపాలన అందించాలని, ఇలాంటి అక్రమార్కులను వెనకేసుకొస్తే ప్రజా క్షేత్రంలో అభాసుపాలవుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ సహచరులతో పాటు ముఖ్యమైన నాయకులతో అంతర్గతంగగా చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. అయితే కరీంనగర్ లోని కొన్ని భూ దందాల విషయంలో మాత్రం అమాయకులకు వ్యతిరేకంగా కొంతమంది అమాత్యుల పేర్లు చెప్తూ ఎంట్రీ ఇస్తుండడం గమనార్హం.  ప్రముఖ మంత్రి వద్ద పనిచేస్తున్నామని, ఆ అమాత్యునికి తాము సన్నిహితులమంటూ  క్షేత్ర స్థాయి అధికారులతో చెప్తూ అక్రమార్కులను కాపాడేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే కేసులు నమోదు చేయకుండా కరీంనగర్ పోలీసులు ఆధారాలు పక్కాగా ఉన్నాయా లేదా అన్న విషయాలపై సమగ్రంగా విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. డాక్యూమెంట్ ఎవిడెన్స్ లతో పాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల నుండి కూడా వివరాలను సేకరిస్తున్న పోలీసులు అటు బాధితులు, ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి నుండి కూడా వివరాలు సేకరించి వారిచ్చిన డాక్యూమెంట్లను కులంకశంగా పరిశీలిస్తున్నారు. అన్ని ఆధారాలు సరైనవేనని నిర్ధారించుకున్న తరువాత పోలీసు యంత్రాంగం క్రిమినల్ చర్యలకు పూనుకుంటోంది. అయితే  పోలీసులు ఆరా తీస్తున్న క్రమంలోనే కొంతమంది ప్రముఖుల వద్ద పనిచేస్తున్న వారి ద్వారా ఒత్తిళ్లకు గురి చేయడం ఆరంభించినట్టుగా సమాచారం. కబ్జాలకు పాల్పడిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రముఖుల పేర్లను వాడుకుంటున్న తీరు ఇప్పుడిప్పుడే కరీంనగర్ ల్లో చర్చ మొదలైంది. ఇలాంటి పైరవీలకు కరీంనగర్ రూరల్ మండలం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వారు కూడా తలదూర్చినట్టుగా తెలుస్తోంది. ఇటువంటి వారిని మంత్రులు కట్టడి చేయనట్టయితే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంటుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలంటున్న వారూ లేకపోలేదు.

You cannot copy content of this page