ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపుల పరంపర కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్‌వర్క్ లింక్డిన్‌లోనూ (LinkedIn) ఉద్యోగుల కోత మొదలైంది. రిక్రూట్‌మెంట్ విభాగానికి చెందిన ఉద్యోగుల్లో కొందరిని తొలగించినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ ప్రకటించిన లేఆఫ్‌ల ప్రణాళికలో లింక్డిన్ కూడా చేరినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ది ఇన్ఫర్మేషన్ అనే వెబ్‌సైట్ కథనం రాసింది. అయితే దీనికి సంబంధించి లింక్డిన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా 10వేల మందిని తొలగించాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం మందిని తొలగిస్తున్నట్లు జనవరిలో వెల్లడించింది. అయితే, ఏ విభాగంలో ఎంతమందిని తొలగించేదీ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో లింక్డిన్‌లో తొలగింపులు చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవలే మైక్రోసాఫ్ట్‌కు చెందిన సియాటెల్ కార్యాలయంలో 600 మందిని తొలగించారు. ఈ క్రమంలోనే లింక్డిన్‌లో తొలగింపులు జరగడం గమనార్హం.
మరోవైపు పలువురు లింక్డిన్ రిక్రూటింగ్ టీమ్ ఉద్యోగులు తాము కంపెనీ నుంచి దూరమవుతున్నామని ప్లాట్‌ఫాంపై పోస్ట్ చేయడంతో లింక్డిన్ లేఆఫ్స్ విషయం వెలుగులోకి వచ్చింది. లింక్డిన్‌లో ఉద్యోగం కోల్పోయిన వారిలో తాను ఒకరినని ఉద్యోగి నికోల్ జవకి రాసుకొచ్చారు. న్యూ రోల్ కోసం ప్రయత్నిస్తున్నానని ఆమె అదే ప్లాట్‌ఫాంను ఆశ్రయించారు. లింక్డిన్‌లో తన ప్రస్థానం ముగియడం దురదృష్టకరమని ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి పేర్కొన్నారు.