దిశ దశ, రామగుండం:
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. చాలా కాలంగా ఊరిస్తూ వస్తున్న ఈ ఎన్నికలపై కోర్టులు, కేంద్ర కార్మిక శాఖ, సింగరేణి యాజమాన్యాలను ఆశ్రయించడంతో వాయిదాలతో సాగుతూ వచ్చిన చివరకు ఎన్నికల తంతు మాత్రం పూర్తయింది. బుధవారం సింగరేణి విస్తరించిన ఉన్న ఆరు జిల్ల్లాలోని 11 ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అర్థరాత్రి వరకూ కౌంటింగ్ కూడా కొనసాగించారు. బ్యాలెట్ విధానంతో సాగిన ఈ ఎన్నికల్లో మెజార్టీ కార్మికులు ఎర్ర జెండా వైపే మొగ్గు చూపగా, ఆ తరువాతి స్థానంలో ఐఎన్ టీయూసీ నిలిచింది. 13 కార్మిక సంఘాలు పోటీ పడినప్పటికీ ప్రత్యక్ష్య పోరు మాత్రం ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ మధ్యే సాగింది.
గుభాళించని గులాభి…
ఉద్యమ ప్రస్థానం నుండి తనదైన మార్కుతో సింగరేణిపై పట్టు బిగించిన బీఆర్ఎస్ అనుభంద సంస్థ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఈ సారి తన ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకుంది. ఈ సారి జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు సూచించడంతో ముఖ్య నాయకులు ముగ్గురు రాజీనామా చేశారు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో టీబీజీకేఎస్ ఉనికి లేకుండా పోయింది. దీంతో ఈ సంఘం నాయకులు ఆయా ప్రాంతాల్లో తమకు నచ్చిన వారికి మద్దతు ఇస్తూ ముందుకు సాగారు. కొన్ని ప్రాంతాల్లో ఏఐటీయూసితో, మరికొన్ని ప్రాంతాల్లో ఐఎన్ టీయూసీతో లోపాయికారిగా చేతులు కలిపిన టీబీజీకేఎస్ నేతలు సపోర్ట్ చేశారు. దిశానిర్దేశం చేసే నాయకులు లేకపోవడం, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా అంతగా శ్రద్ద చూపకపోవడంతో టీబీజీకేఎస్ సైలెంట్ అయిపోందనే చెప్పాలి. అదిష్టానం పెద్దల నిర్ణయం చెప్పే వరకు గనుల్లో ప్రచారం చేసిన ఆయా ప్రాంతాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దశాబ్ద కాలంగా సింగరేణిపై పట్టు నిలుపుకున్న టీబీజీకేఎస్ ఈ ఎన్నికల్లో ఎ మాత్రం ప్రభావం చూపించే పరిస్థితి లేకుండా పోయింది.
నిన్నటి ఎన్నికల్లో…
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు… శాశ్వత మిత్రులు ఉండరన్న నానుడికి ఇటీవల జరిగిన ఎన్నికలు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కామ్రేడ్స్ కలిసి పోటీ చేసి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కుంచుకుంటే… సింగరేణి ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థులుగా మారారు. రాష్ట్రంలో పొత్తుల ఎత్తులతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అనుభంద సంఘం ఐఎన్ టీయూసీ, సీపీఐ అనుభంద సంఘం ఏఐటీయూసీలు సింగరేణి గుర్తింపు సంఘంలో ప్రధాన ప్రత్యర్థులుగా బరిలో నిలవడం గమనార్హం.
ఫలితాల వివరాలివే..
ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో 39,773 మంది కార్మికులకు గాను 37,451 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 94.16 శాతం ఓట్లు పోలయ్యాయి. బుధవారం అర్థరాత్రి జరిగిన కౌంటింగ్ తో ఏఐటీయూసీ విజయకేతనం ఎగురవేసినట్టుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. మెజార్టీ ఓటర్లు ఏఐటీయూసీకి అండగా నిలవడంతో ఐఎన్ టీయూసీ రెండో స్థానంలో నిలిచింది. 1999 ఓట్ల మెజార్టీతో ఏఐటీయూసీ మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. దీంతో మరోసారి గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ తన సత్తా చాటుకుంది. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా చివరి నిమిషంలో సింగరేణి ఏరియాల్లో ప్రచారం చేశారు. కానీ అప్పటికే ఏఐటీయూసీ తన పట్టు బిగించడంతో ఐఎన్ టీయూసీ రెండో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.
గత ఎన్నికలకు..
గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పక తప్పుద. ఈ సారి మద్యం, ఇతరాత్ర ప్రలోభాలు అక్కడక్కడ కనిపించినా గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఇది నామమాత్రమనే చెప్పాలి. గత ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా కొనసాగిన ప్రలోభాల పర్వం ఆల్ టైం రికార్డనే చెప్పవచ్చు. గతంలో తమ ఉనికిని చాటుకోవడం, తామందిచిన సేవలను వివరించడంతో ప్రచారం సాగగా గత ఎన్నికల్లో మాత్రం మద్యం ఏరులై పారిందన్నది వాస్తవం. కొన్ని ప్రాంతాల్లో అయితే కార్మికులను ప్రలోభాలకు గురి చేసేందుకు ఆర్థిక వనరులు కూడా సమకూర్చారన్న ఆరోఫణలు వెల్లువెత్తాయి. కానీ ఈ సారి మాత్రం ఆ స్థాయిలో ప్రలోభాల పర్వానికి అవకాశం లేకుండా పోయిందన్నది వాస్తవం.