దిశ దశ, భూపాలపల్లి:
భూపాలపల్లి జిల్లా వరదనీటిలో చిక్కుకున్న మోరంచపల్లి వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి, కలెక్టర్ భ్రవేశ్ మిశ్రా, కలెక్టర్ పి కరుణాకర్ లు వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేకంగా వాటర్ బోట్స్ ను తెప్పించిన యంత్రాంగం వాటి ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దరి చేరిన గ్రామస్థులను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులను కూడా రప్పించారు. వాటర్ బోట్స్ ద్వారా రెస్క్యూ టీం ఇండ్లపై బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న వారిని సేఫ్ గా తరలించనున్నారు.
ఆరు గంటలుగా నరక యాతన…
ఆరుగంటలుగా మోరంచపల్లి వాసులు నరక యాతన అనుభవిస్తున్నారు. చుట్టూ చేరిన వరద నీరు… క్రమ క్రమంగా పెరుగుతున్న తీరుతో భయం భయంగా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. తెల్లావారక ముందే తమ బ్రతుకులు తెల్లారిపోతాయని ఊహించని గ్రామస్థులు బుధవారం నిద్రలోకి జారుకున్నారు. గురువారం వేకువ జామున లేచి చూసే సరికి గ్రామం చుట్టూ వరద నీరు వచ్చి చేరుతున్న విషయాన్ని గమనించి అరుపులు అందుకున్నారు. ఇండ్లు మునిగిపోతున్నాయంటూ అరవడంతో గ్రామంలోని చాలా మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇండ్లపైకి చేరుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ వరకూ అంటే దాదాపు 10 నుండి 12 ఫీట్ల ఎత్తు వరకు నీరు వచ్చి చేరడంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎవరూ ఊహించని రీతిలో మోరంచపల్లిని ముంచెత్తిన వరదల గురించి అధికారులకు ఆలస్యంగా సమాచారం అందడంతో వారు హుటాహుటిన మోరంచపల్లికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.