దిశ దశ, భూపాలపల్లి:
మాకు సంబంధం లేదని బుకాయించిన సంస్థే ఇప్పుడు సరిదిద్దుకునే పనిలో నిమగ్నం అయింది. అప్పుడు అంతా బాధ్యతే అని చెప్పిన నిర్మాణ సంస్థ ఆ తరువాత చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం గుస్సా చేయడంతో ఎట్టకేలకు బాగు చేసే పనిని తన భుజాన వేసుకున్నట్టుగా ఉంది. ఎట్టకేలకు బ్యారేజీ మరమ్మత్తులకు సంబంధించిన రిపేర్లకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశంగా మారింది.
మేడిగడ్డకు పునరుజ్జీవం…
మూడేళ్లుగా నీటితో కళకళలాడిన మేడిగడ్డ బ్యారేజ్ గత అక్టోబర్ నుండి వెలవెలబోయింది. అనూహ్యంగా బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో ముణ్ణాళ్ల ముచ్చటగా మారిన ఈ ప్రాజెక్టుపై ఆశలు వదులుకోవల్సి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయువు పట్టుగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిపోయిన నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ఇంజనీర్ సురేష్ రంగంలోకి దిగారు. బ్యారేజ్ మెయింటనెన్స్ బాధ్యత తమదేనని లోపాన్ని సరిదిద్దుతామని కూడా ప్రకటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొనడంతో కాళేశ్వరం అంశం మరుగునపడిపోయింది. ఎన్నికల తరువాత ఎల్ అండ్ టి ప్రతినిధులు బ్యారేజ్ నిర్మాణం తరువాత అగ్రిమెంట్ కాల పరిమితి ముగిసిపోయినందున కుంగిపోయిన పిల్లర్లను బాగు చేయాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెప్పింది. దీంతో ఈ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఎల్ అండ్ టీ ప్రతినిధులతో భేటీ కావాలని నిర్ణయించారు. సంస్థ ప్రతినిధి బృందం హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశం అయిన సందర్భంలో ఇదే వాదనను తెరపైకి తీసుకరాగా కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులపై మండిపడ్డారు. మాట మార్చడంతో పాటు నిభందనలకు విరుద్దంగా వ్యవహరించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పూర్తి నివేదికలు తనకు ఇవ్వాలని ఆదేశించారు మంత్రి. ఎల్ అండ్ టిపై కూడా చర్యలు తీసుకోవాలన్న యోచనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడంతో ఎట్టకేలకు సదరు సంస్థ దిద్దుబాటు చర్యలకు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.
మరమ్మత్తులకు శ్రీకారం…
మేడిగడ్డ బ్యారేజి ఏడో బ్లాక్ కు సంబంధించిన 19, 20, 21 పిల్లర్లు కుంగిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బ్యారేజ్ గేట్లు కూడా విరిగిపోవడంతో అక్కడి ఆ ప్రాంతంలో నిలువ ఉన్న నీటిని మళ్లీంచే పనిలో నిమగ్నం అయ్యారు. 7, 8 బ్లాకుల నీటిని దారి మళ్లించి ప్రత్యేకంగా కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కాపర్ డ్యాం నిర్మాణం పూర్తయిన తరువాత కుంగిపోయిన పిల్లర్లను కూడా బాగు చేసేందుకు సదరు నిర్మాణ కంపెనీ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంట్రాక్టు అనంతరం మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయినప్పటికీ వారు ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఇరిగేషన్ ముఖ్య అధికారులకు హైండోవర్ చేయలేదు. అంతేకాకుండా వందేళ్ల పాటు నిలవాల్సిన బ్యారేజ్ మూడేళ్లకే కుంగిపోవడానికి గల కారణాలు ఏంటీ అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఈ విషయంలో నిర్మాణ సంస్థపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు మరమ్మత్తులు మొదలయ్యాయి. అయితే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పనులు చేపట్టిన కాంట్రాక్టు కంపెనీ తెలంగాణ వైపు నుండి కాకుండా మహారాష్ట్ర వైపు నుండి పనులు చేస్తున్నారు. ఏడో బ్లాక్ కూడా అటుగానే ఉండడం అటు వైపు నుండి పనులు చేపట్టినట్టుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ వైపు నుండి మేడిగడ్డ బ్యారేజ్ వైపునకు ఎవరినీ అనుమతించకుండా కట్టడి చేశారు.