గ్రావిటీ కెనాల్ కు రిపేర్…

దిశ దశ, భూపాలపల్లి:

కన్నెపల్లి పంప్ హౌజ్ నుండి అన్నారం బ్యారేజీకి తరలించేందుకు నిర్మించిన గ్రావిటీ కెనాల్ మరమ్మత్తులు చేస్తుండడం గమనార్హం. కెనాల్ కు ఇరువైపులా వేసిన రెయిలింగ్స్ కుంగిపోవడంతో ఇరిగేషన్ అధికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు. దీంతో కాళేశ్వరం కెనాల్ విషయంలోనూ నాణ్యతా ప్రామాణాలకు ప్రాధాన్యత కల్పించలేదా లేక కాలువ నిర్మాణం చేయాలనుకున్న ప్రాంతంలో మట్టి పరీక్షలు నిర్వహించుకుండానే నిర్మాణాలు చేపట్టారా అన్న ప్రశ్న తలెత్తుంది. తెలంగాణ రాష్ట్రానికే కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో తరుచూ ఇలాంటి అవాంతరాలు రావడానికి కారణాలు ఏంటన్నది అధికారులకే తెలియాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మెటిరియల్ ఎంత మేర ఉపయోగించడం, గతంలో ఎన్నో ప్రాజెక్టులు ఇలాంటి సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నాయని, నిర్మాణ కంపెనీలు ఐదేళ్ల వరకూ మెయింటనెన్స్ చేసే బాధ్యతలు తీసుకున్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ అసలైన లాజిక్ ను మిస్సవుతున్నరా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిర్మాణ సమయంలో భూ పరీక్షలు చేసిన తరువాత అందుకు తగినట్టుగా కాంక్రీట్, స్టీల్ తో పాటు ఇతరాత్ర మెటిరియల్ వినియోగించడం, డెప్త్ ఎంత మేర తీసుకోవాలి, కెనాల్ రెయిలింగ్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలన్నింటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాతే ముందుకు సాగుతుంటారు. ఇందుకు సంబంధించిన అంచనాలు, నిధుల కెటాయింపు, టెక్నికల్ గా ఎదురయ్యే సమస్యలు, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటు ఇంజనీరింగ్ విభాగం అధికారులు నిర్మాణాలు చేపడుతుంటారు. కాళేశ్వరం విషయంలో మాత్రం తొలినాళ్లలోనే సమస్యలు ఎదురవుతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి ముంచెత్తుతోంది. గతంలో ఓ ప్రాజెక్టులో మోటార్లు మునిగిపోయాయంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్న పోస్టుల తీరును విస్మయపరుస్తోంది. ఇతర ప్రాజెక్టుల్లో ఏర్పాటు చేసిన మోటార్లు మునిగిపోవడం వెనక కారణాలు ఏంటీ..? కాళేశ్వరం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అన్న విషయంపై అధ్యయనం చేశారా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత లేకుండా పోతోంది. చిన్న చిన్న నదుల వద్ద చేపట్టిన ప్రాజెక్టుల్లోనే ముంపు సమస్య ఎదురయినప్పుడు జీవనదిగా ఉన్న గోదావరి, అందునా భారీగా వరద పొటెత్తే ప్రాణహిత గోదావరిలో కలుస్తున్న తరువాత దిగువ ప్రాంతంలో చేపడుతున్న ప్రాజెక్టు ముంపునకు గురి కాకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయ్యారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అనుభవాలను పాఠాలుగా నేర్చుకోవడంలో అధికారులు విఫలం అయ్యామని చెప్పకనే చెప్తున్నారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు మోటార్లు మునిగిపోయాయని చెప్తున్నప్పుడు కన్నెపల్లి పంప్ హౌజ్ విషయంలో ఆ అనుభవాలను పరిగణనలోకి తీసుకున్నారా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కన్నెపల్లి పంప్ హౌజ్ లో మోటార్లు ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ మోాటర్లు ఎందుకు ముంపునకు గురయ్యాయన్నది అంతుచిక్కకుండా పోతోంది. తాజాగా గ్రావిటీ కెనాల్ మరమ్మత్తులు చేస్తుండడం వెనక కూడా అసలు కారణాలు ఏంటన్నదే అర్థం కాకుండా పోతోంది.

మూడు బ్యారేజీలు ఖాళీ…

మరో వైపున కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలు కూడా ఖాలీ అయ్యాయి. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం చేసిన సూచనల మేరకు బ్యాక్ వాటర్ అంతా దిగువక వదిలేశారు. గత నెలలో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడంతో నీటిని వదిలేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ బృందం కూడా క్షేత్ర స్థాయి పరిశీలన చేసి ఓ నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఒకే విధమైన డిజైన్ చేసిన కారణంగ మూడింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని అభిప్రాయపడింది. దీంతో అన్నారం బ్యాక్ వాటర్ ఖాలీ చేసిన అధికారులు తాజాగా గురువారం నుండి సుందిళ్ల బ్యారేజీ నుండి కూడా నీటిని దిగువకు వదలడం ఆరంభించారు. 8 గేట్లు ఎత్తి సుందిళ్లను కూడా ఖాలీ చేస్తున్నారు. మూడు బ్యారేజీలకు సంబంధించిన పిల్లర్లు, ఇతర నిర్మాణాలపై అధ్యయనం చేసిన తరువాత మరో నివేదిక తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలన చేసి డ్యాంలకు సంబంధించిన సమస్యను అధిగమించేందుకు అవసరమైన సలహాలు అందించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

You cannot copy content of this page