దిశ దశ, దండకారణ్యం:
దశాబ్దం క్రితం వాటిపై దాడులు ఎలా చేయాలన్న యోచనతో నక్సల్స్ రెక్కి నిర్వహించారు. ఇప్పుడవే జవాన్లను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ లో భాగస్వామ్యం అవుతున్నాయి. దండకారణ్య అటవీ ప్రాంతంలో స్వీయ రక్షణ చర్యల్లో భాగంగా మావోయిస్టులు బలగాల ఎత్తులను పదేళ్ల క్రితమే అంచనా వేశారు. అడవుల్లో పార్టీ మిలటరీ కమిషన్ సభ్యులు హెలిక్యాప్టర్ల బొమ్మలను తయారు చేసి వాటిపై దాడులు ఎలా చేస్తే సఫలం అవుతామన్న అంశాలపై పరిశోధనలు చేశారు. దాడులు చేసేందుకు అవసరమైన వ్యూహాలను సిద్దం చేసుకున్న నక్సల్స్ విహాంగంలో సంచరించే హెలిక్యాప్టర్లపై దాడులు చేసినట్టయితే బలగాల వ్యూహాలకు చెక్ పెట్టినట్టు అవుతుందని భావించారు. కేంద్ర కమిటీ సాంకేతిక విభాగం కూడా ఇందుకు అవసరమైన కసరత్తులు చేసేందుకు బాధ్యతలు అప్పగించింది. రెక్కి నిర్వహించిన వీడియోలు కూడా తీసి పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. అయితే ఇదే సమయంలో తెలంగాణాలో ప్రభుత్వం జరుపుతున్న ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా అండర్ టన్నెల్స్ తవ్వకాల కోసం కూలీల వేషంలో కొంతమంది నక్సల్స్ పనుల్లో కుదిరారు. కూలీలుగా పని చేస్తూ మందుగుండు సామగ్రిని తరలించే పనిలో నిమగ్నం అయ్యారని కూడా ఇక్కడి పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో సహచర కూలీలకు మావోయిస్టు పోరాటం గురించి కూడా చైతన్యం కల్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే చత్తీస్ గడ్ కు చెందిన మావోయిస్టు పార్టీ బాధ్యుడు ఒకరు ఇతర కూలీలకు మావోయిస్టు పార్టీ శిక్షణ శిబిరాలు, పోలీస్ స్టేషన్లపై దాడులు ఎలా నిర్వహిస్తారన్న వీడియోలను చూపించారు. ఇదే సమయంలో హెలిక్యాప్టర్లపై దాడులు చేసేందుకు నిర్వహించిన రెక్కి వీడియోలు కూడా తెలంగాణ పోలీసులకు చిక్కాయి. నక్సల్స్ వద్ద ఉన్న వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు మావోయిస్టుల వ్యూహాలు, అంచనాల సమాలోచనలు జరిపారు. బస్తర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ నక్సల్స్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతున్నారోనన్న విషయం ఈ వీడియోలతో బహిర్గతం అయింది. ఆధునిక ఆయుధాలు, మందుపాతరలను ఉపయోగించి పేల్చివేయడం, క్లైమోర్ మైన్స్ తో దాడులు చేయడం వంటి అంశాలతో పాటు బలగాలను టార్గెట్ చేసేందుకు మావోయిస్టు పార్టీ వేస్తున్న అడుగులపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అంతకుముందు కూడా మైన్ ప్రూఫ్ వాహనాలను పేల్చివేసే విషయంలో మావోయిస్టు పార్టీ టెక్నికల్ వింగ్ చేసిన ఎనాలిసిస్ సంచలనమేనని చెప్పాలి. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన మైన్ ప్రూఫ్ వాహానల సామర్థ్యం ఎంత..? వాటిని పేల్చి వేసేందుకు ఏ స్థాయిలో మందుపాతర ఉపయోగించాలి, మైన్ ప్రూఫ్ వెహికిల్ లో ఎంతమంది ప్రయాణించే అవకాశం ఉంది, అందులోకి ఎక్కేందుకు ఎన్ని డోర్లు ఏర్పాటు చేశారు, వెనక భాగంలో మాత్రమే కూర్చునే అవకాశం ఉన్న జవాన్లు పరిసర ప్రాంతాలను గమనించేందుకు విండోస్ ఎన్ని ఏర్పాటు చేశారన్న అంశాలపై ఓ అధ్యయనం చేసింది. మైన్ ప్రూఫ్ వాహనాల్లోని లోపాలను ఎత్తి చూపుతు వాటిని పేల్చి వేసిన తరువాత అంబూష్ చేసి అందులోంచి దిగే వారిపై కాల్పులు జరిపి చంపే అవకాశం ఉందని కూడా గుర్తించింది. మావోయిస్టు పార్టీ అధికారిక పత్రిక ‘‘ఆవామి ఏ జంగ్’’లో చేసిన ఈ ఎనాలిస్ కథనాలు కూంబింగ్ బలగాలకు చిక్కడంతో వెలుగులోకి వచ్చింది. ఇదే విధానంతో దండకారణ్యంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బలగాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. మైన్ ప్రూఫ్ వాహానాలపై దాడులు చేసేందుకు అధ్యయనం చేసినట్టుగానే మావోయిస్టులు హెలిక్యాప్టర్ ఆపరేషన్లను కట్టడి చేసేందుకు ఎలా వ్యవహరించాలి అన్న అంశాలపై దృష్టి సారించింది. పదేళ్ల క్రితం హెలిక్యాప్టర్లపై దాడులు చేసేందుకు పథక రచన చేసిన మావోయిస్టు నక్సల్స్ ఇప్పుడు డిఫెన్స్ లో పడుతున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రెస్క్యూ ఆపరేషన్లు…
ఒకప్పుడు హెలిక్యాప్టర్లను టార్గెట్ చేయాలని రెక్కి నిర్వహించిన మావోయిస్టుల ఇలాకాలో నేడు హెలిక్యాప్టర్లను ఉపయోగిస్తున్నాయి బలగాలు. నక్సల్స్ ఏరివేత కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలు గాయపడితే వారికి చికిత్స అందించేందుకు హెలిక్యాప్టర్లను ఉపయోగిస్తున్నారు ప్రబావిత ప్రాంత పోలీసు అధికారులు. జవాన్లు ప్రాణాలు కాపాడేందుకు హుటాహుటిన హెలిక్యాప్టర్లను ఘటనా స్థలానికి పంపించి రెస్క్యూ ఆపరేషన్లు చేపడుతున్నారు. దశాబ్ద కాలం క్రితం హెలిక్యాప్టర్లపై దాడులు చేయాలని కసరత్తులు చేసిన మావోయిస్టుల పెట్టని కోటలో నేడు హెలిక్యాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి.