కంబోడియా TO జగిత్యాల

యూపీ పోలీసుల ఎంట్రీ…

దిశ దశ, జగిత్యాల:

కంబోడియా కేంద్రంగా సాగుతున్న సైబర్ క్రైం ఘటనల్లో తెలంగాణ వాసులు కేవలం బాధితులే కాదు… నిందితులుగా మారి కూడా ఇబ్బందులు పడుతున్నారు. కంబోడియా కేంద్రంగా చైనీయులు కాల్ డాటా సెంటర్లను ఏర్పాటు చేసి ఉపాధి పేరిట నిరుద్యోగులను బలి చేస్తున్నారు. దళారులు ద్వారా కంబోడియాలో ఉపాధి అవకాశాలంటూ నిరుద్యోగ యువతనుఈ రొంపిలోకి దింపుతున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు యువకులు కంబోడియా చేరుకుని అగ్రిమెంట్ చేసుకునే ముందు అసలు విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్నారు. అయితే తాజాగా కంబోడియా కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ సైబర్ క్రైం గ్యాంగు ఉచ్చులో జగిత్యాల వాసులు మరో విధంగా చిక్కుకున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన పోలీసుల బృందం జగిత్యాలకు చేరుకోవడంతో కంబోడియా సైబర్ క్రిమినల్స్ తో చేతులు కలిపిన విషయం బయటపడింది. కంబోడియా నుండి జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరి అకౌంట్లకు రూ. 2 కోట్లు బదిలీ చేసినట్టుగా గుర్తించిన యూపీ పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు జగిత్యాల జిల్లాకు చేరుకున్నారు. గొల్లపల్లి మండలం దట్నూరుకు చెందిన మిట్టపల్లి రమేష్, జగిత్యాల జిల్లా కేంద్రంలోని అల్లే సత్యంల ఖాతాలకు సైబర్ క్రిమినల్స్ రూ. 2 కోట్లు బదిలీ చేశారు. అయితే వీటిని తాము మహారాష్ట్రలోని పూణేకు చెందిన మరో వ్యక్తికి పంపించాలని చెప్పడంతో అతనికే పంపించామని వారు చెప్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న ఉత్తర ప్రదేశ్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచి తీసుకెళ్లారు.

You cannot copy content of this page