అక్కడ అభ్యర్థులు… ఇక్కడ మూలాలు…

దిశ దశ కరీంనగర్:

లోకసభ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులకు ఇతర ప్రాంతాల్లో ఉనికిని చాటుకునే అవకాశం లభించింది. ఇప్పటికే ప్రత్యక్ష్య రాజకీయాల్లో ఉన్న ఆ నాయకులు ఇద్దరు కూడా ఎంపీ ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ప్రయత్నాల్లో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించిన ఇద్దరికి కూడా ఒకే రకమైన వ్యాపారాలు ఉండడం విశేషం.

ఇద్దరూ ఇద్దరే…

చేవెళ్ల నియోజకవర్గం నుండి రెండో సారి ఎంపీగా పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్ర నివాసి. వ్యాపారాల నిమిత్తం చాలా కాలం క్రితం హైదరాబాద్ షిఫ్ట్ అయిన రంజిత్ రెడ్డి గత ఎన్నికల్లో చేవెళ్ల నుండి పోటీ చేసి ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన రంజిత్ రెడ్డి ఈ సారి కూడా అక్కడి నుండి పోటీ చేస్తున్న ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో నిలిచారు. ప్రస్తుతం మల్కాజిగిరి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వారే కావడం గమనార్హం. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన ఆయన వ్యాపార రిత్యా హైదరాబాద్ లో స్థిరపడగా ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ తో కలిసి నడిచారు. 2023 ఎన్నికల వరకు కూడా కమలాపూర్, హుజురాబాద్ నియోజకవర్గాల నుండి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో ఉన్న వీరిద్దరు కూడా 2021 వరకు కూడా ఉద్యమ పార్టీలోనే కొనసాగారు. వీరిద్దరు కూడా పౌల్ట్రీ వ్యాపారం చేస్తున్నవారే కావడం గమనార్హం.

ఢిల్లీకెల్తారా..?

అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వీరిద్దరు నాయకులు కూడా ఇతర ప్రాంతాల్లో పోటీ చేస్తుండడంతో ఏక కాలంలో వీరిద్దరు ఢిల్లీకి వెల్తారా అన్న చర్చ సాగుతోంది. చేవెళ్ల నుండి రెండో సారి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డిని అక్కడి ప్రజలు ఆదరిస్తే మరోసారి పార్లమెంటులోకి అడుగు పెట్టనున్నారు. ఇకపోతే మల్కాజిగిరి నుండి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ గెలిస్తే దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన క్రెడిట్ కొట్టేయనున్నారు.

You cannot copy content of this page