దిశ దశ, వేములవాడ:
ఆరోగ్య శాఖ మాజీ డైరక్టర్ తన మనసులోని మాట వెల్లడించారు. ఇంతకాలం నర్మగర్భంగా వ్యవహరించిన ఆయన తన పయనమిక రాజకీయాల్లోనే అంటూ కుండబద్దలు కొట్టారు. తనకు ప్రజా క్షేత్రంలోనే ఇక తన జీవితం కొనసాగబోతుందని ప్రకటించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్నూరు కాపు సత్రం 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 25 ఏళ్ల తన ఉద్యోగ జీవితానికి రాజీనామా చేస్తున్నానని, ప్రజా జీవితంలోకి రావాలని నిశ్చయించుకున్నానన్నారు. తన తండ్రి పేరిట కొత్తగూడెం ప్రాంతంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, తన ఫస్ట్ ప్రయారిటీ తన జాతి కోసమేనంటూ వెల్లడించారు. సికింద్రాబాద్, ఖమ్మం లోకసభ స్థానాల నుండి తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి దరకాస్తు చేసుకున్నానిన కూడా గడల శ్రీనివాస్ ప్రకటించడం గమనార్హం.
ప్రజాస్వామ్యం ఇక్కడే…
ప్రజాస్వామ్య వాతావరణం కాంగ్రెస్ పార్టీలోనే ఉందని దరకాస్తులు తీసుకుని అర్హులైన వారికి టికెట్లు ఇచ్చే సంస్కృతి కొనసాగడమే ఇందుకు నిదర్శనమన్నారు. చిన్న పిల్లాడిని కాదని 54 ఏళ్ల వయసు వచ్చిన తనకు అన్నింటా అవగాహన ఉందన్న గడల శ్రీనివాస్ రావు ముఖ్యమైన బాధ్యతలు కూడా నిర్వరించానని ఇంకా ఎధగాల్సింది ఏమీ లేదని ప్రజా జీవతంలోకి రావడం తప్ప అంటూ వ్యాఖ్యానించారు. తమ్ముడు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యేందుకు తనవంతుగా కృషి చేస్తానని, ఆయన మున్నూరు కాపు బిడ్డ అని తనకు ఆరేడేళ్ల క్రితమే తెలిసిందన్నారు. మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్న నియోజకవర్గాలకు చెందిన జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వాడినేని అన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మల్లన్న ఎమ్మెల్సీ అయ్యేందుకు అవసరమైన విధంగా తోడ్పాటును అందిస్తానన్నారు.
మారిన స్వరం…
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీపై భారీ ఆశలు పెట్టుకున్న గడల శ్రీనివాస రావు కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తుకున్నారు. ఆయనకు పాదాభివందనం చేసిన విషయంలో కూడా ఘాటుగానే స్పందించిన ఆయన వంద సార్లు అయినా మొక్కుతా అంటూ బాహాటంగానే ప్రకటించారు. అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన ఆయనకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించలేదు. ఎన్నికల తరువాత ప్రభుత్వం మారగానే ఆయనకు స్థాన చలనం కల్పించిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న గడల శ్రీనివాస రావు ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వేములవాడ మున్నూరు కాపు సత్రం వార్షికోత్సవంలో కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుంటూ వ్యాఖ్యలు చేశారు.