అదుపులోకి తీసుకున్న గోపాలపురం పోలీసులు
దిశ దశ, కరీంనగర్:
రిటైర్డ్ సీఐ, తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్ దాసరి భూమయ్యను కొద్ది సేపటి క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం కరీంనగర్ లోని ఆయన ఇంటికి చేరుకున్న సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు దాసరి భూమయ్యను అరెస్ట్ చేస్తున్నామని ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు. కానిస్టేబుల్ జైపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నామని వివరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయనపై ఏ కేసులు నమోదు చేశారు..? 41 సీఆర్పీసీ నోటీసు ఇచ్చి పంపిస్తారా లేక అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తారా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. నాస్తికత్వానికి ఎక్కువ ప్రాధానత్య ఇచ్చే దాసరి భూమయ్య ఇటీవల కాలంలో కొంత మేర యాక్టివ్ నెస్ ను కూడా తగ్గించారు. ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తీన్మార్ మల్లన్న టీంకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అయితే భూమయ్య రిటైర్ కాకముందు ఔటర్ రింగ్ రోడ్డుపై ఏసీబీ అధికారులు పట్టుకుని సోదాలు నిర్వహించారు. ఆయన కారులో డబ్బు దొరకడంతో అక్రమ నగదు స్వాధీనం చేసుకున్న కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం తరువాత భూమయ్యపై అంతగా ఎలాంటి కేసులు అయితే నమోదు కాలేదు. హస్నాబాద్ ఠాణాలో తుపాకుల మిస్సింగ్ విషయంలో కూడా భూమయ్యను భాధ్యున్ని చేసి నోటీసులు ఇచ్చినప్పటికీ అవి మరో వ్యక్తి వద్ద లభ్యం కాగా ఈ వ్యవహారానికి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు గుర్తించినట్టుగా సమాచారం. హుజురాబాద్ బై పోల్స్ లో గులాభి కండువా కప్పుకున్న భూమయ్య ఆ తరువాత బయటకు వచ్చారు. తీన్మార్ మల్లన్న టీంతో కలిసి పనిచేసిన భూమయ్య మల్లన్న బీజేపీలో చేరగానే దూరంగా ఉన్నారు. తీన్మార్ మల్లన్న బీజేపీని వీడడంతో తిరిగి అయనతో కలిసి పనిచేస్తున్నారు. అనూహ్యంగా భూమయ్యపై ఏ కేసు నమోదు అయింది అన్నదే అంతు చిక్కకుండా పోయిందని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఏది ఏమైనా దాసరి భూమయ్య అరెస్ట్ మాత్రం కరీంనగర్ లో కలకలం సృష్టిస్తోంది.
Disha Dasha
1884 posts
Next Post