మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు మాతృ వియోగం

దిశ దశ, కరీంనగర్:

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితునిగా ఉన్న రిటైర్డ్ డీసీపీ పి రాధాకిషన్ రావుకు మాతృ వియోగం కలిగింది. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. జనగామ జిల్లా చిల్పూరు మండలం పల్లెగుట్టకు చెందిన రాధాకిషన్ రావు పదోన్నతి పొందుతూ డీసీపీ స్థాయికి ఎదిగారు. తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన నిందితునిగా ఉన్నారు. ఇటీవలే తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని కోర్టు అనుమతి తీసుకున్న రాధా కిషన్ రావు కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి పరమార్శించారు. 98 ఏళ్ల వయసు ఉన్న సరోజనమ్మ నూరేళ్ల పాటు జీవించాలని కుటుంబ సభ్యులు ఆశించారు. వీరి కుటుంబంలో చాలా మంది దీర్ఘాయుష్యు అందుకున్న వారే కావడంతో సరోజనమ్మ కూడా నిండు నూరేళ్లు బ్రతకాలని వారసులు ఆకాంక్షించారు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సరోజనమ్మకు కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నపటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమె మరణించిన సమాచారం అందుకున్న రాధాకిషన్ రావు తన తల్లిని చివరి చూపు చూసేందుకు అనుమతించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేయించారు. అత్యవసర పిటిషన్ ను విచారించి తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ రాధాకిషన్ రావు నాంపల్లి కోర్టను అభ్యర్థించారు. కోర్టు ఆదేశాల తరువాత చంచల్ గూడ జైల్లో ఉన్న రాధా కిషన్ రావు తల్లి సరోజనమ్మ అంత్యక్రియలకు హాజరు కానున్నారు. ప్రస్తుతం కరీంనగర్ ఆసుపత్రిలో సరోజనమ్మ మృతదేహాన్ని ఫ్రీజర్ లో ఉంచారు. కోర్టు ఆదేశాల అనంతరం ఆమె శవాన్ని స్టేషన్ ఘన్ పూర్ సమీపంలోని పల్లెగుట్టకు తీసుకెళ్లనున్నారు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.

You cannot copy content of this page